హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోజు రోజుకు కల్తీ పెరిగిపోతుంది. నిత్యం ఎక్కడో ఒక చోట కల్తీ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ధనార్జనే లక్ష్యంగా కొందరు వ్యాపారులు ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటి వరకు తినే పదార్థాలు కల్తీ చేయగా.. తాజాగా నకిలీ సిగరెట్ల వ్యవహారం బయపడింది.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నడిబొడ్డు, రోజుకు కోట్ల బిజినెస్ జరిగే బేగం బజార్లో నకిలీ సిగరెట్లు తయారు చేస్తోన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు షాహినాయత్‌గంజ్ పోలీసులతో కలిసి శనివారం (జనవరి 11) బేగంబజార్‌లో ఒక గోడౌన్‌పై దాడి చేశారు. ఈ దాడుల్లో పోలీసుల అనుమానం నిజమైంది. ఆ గోడౌన్లో వివిధ ప్రముఖ సిగరేట్ బ్రాండ్ల పేరుతో నకిలీ సిగరెట్లు అమ్ముతున్నారు.
దీంతో నకిలీ సిగరెట్లు అమ్ముతోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.11.2 లక్షల విలువైన డూప్లికేట్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా నకిలీరాయుళ్లకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నకిలీ దందాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.