
- వానాకాలం సీజన్ రాకముందే రైతులను కలుస్తున్న దళారులు
- ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి విత్తనాల రాక
- ఏజెంట్లను నియమించుకొని, విక్రయాలు
- ఆసిఫాబాద్ జిల్లాలో పరిస్థితి
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందాకు అడ్డుకట్ట పడటం లేదు. వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే జోరుగా సాగుతోంది. వాటిని అమాయక రైతులకు అంటగడుతున్న వ్యాపారులు, దళారులు రూ.లక్షల్లో దండుకుంటున్నారు. ఇందుకోసం స్థానికంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా రూ.కోట్ల విలువైన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారు.
రైతుల వద్దకే వచ్చి, వివరాల సేకరణ
వానాకాలం పత్తి సాగు చేసే రైతుల వద్దకు వెళ్తున్న దళారులు.. ఎంత విస్తీర్ణంలో పంట వేస్తారు.. ఎలాంటి విత్తనాలు కావాలి, పత్తి కాయలు పెద్దగా వచ్చేవైతే ఒక రేటు,చిన్నగా వచ్చేవి కొంచెం తక్కువ ధరకే ఇస్తామని నమ్మిస్తున్నారు. మీరు కంపెనీల దుకాణాల వద్దకు పోవాల్సిన అవసరం లేదని, చేను ఎన్ని ఎకరాలో చెబితే చాలు.. తొలకరి జల్లులు పడకముందే విత్తన పాకెట్లు ఇంటికి పంపుతామంటూ రైతుల ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో దళారులు తమ దందా తీరును మార్చి, గుట్టుచప్పుడు కాకుండా రైతులకు విత్తనాలు అందించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు కౌటాల, బెజ్జుర్, సిర్పూర్ టి, కెరమెరి, జైనుర్, లింగాపూర్, సిర్పూర్ యు, పెంచికల్ పేట్, చింతలమానేపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఈ దందా 15 రోజులుగా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏజెన్సీలోని గిరిజన రైతుల అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని, నకిలీ, లూజ్విత్తనాలను ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా తీసుకువచ్చి, అంటగడుతున్నారు. రైతులు పంటల సాగుకు డబ్బులు లేక వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించడమూ ఇందుకు కారణమవుతోంది.
అవగాహన లేకనే..
పంట దిగుబడి ఎక్కువ వస్తుందని, ఎటువంటి కలుపు బాధలు ఉండవని చెబుతూ దళారులు నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారు. ఏ విత్తనాలు మంచివో, ఏవి నకిలీవో తెలియక అన్నదాతలు ఏటా నష్టపోతున్నారు. సారవంతమైన భూములు నిర్జీవంగా మారుతున్నాయి. అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో సదస్సులు నిర్వహించాలి.
3 క్వింటాళ్లు పట్టివేత
శుక్రవారం చింతలమానేపల్లి మండలంలో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. రూ.10.50 లక్షల విలువైన 3 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. నిందితుడు, ఆసిఫాబాద్ మండలం బురుగూడకు చెందిన లోకండే భిక్షపతిపై కేసు నమోదు చేశారు. ఈ విత్తనాలు గుంటూరు నుంచి తెచ్చినట్లు అతను చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటివాళ్లు ఎంతో మంది ఉన్నారని సమాచారం.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. నకిలీ విత్తనాల సరఫరా, విక్రయాలపై గట్టి నిఘా పెట్టినం. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి రైతులు నష్ట పోతున్నరు. దిగుబడి రాక ఆత్మహత్య చేసుకుంటున్నరు. రైతులు నష్ట పోకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నం. ఎవరూ నకిలీ విత్తనాలు కొనుగోలు చేయవద్దు.
డీవీ శ్రీనివాస రావు, ఎస్పీ, ఆసిఫాబాద్