
- ప్రాణహిత నది అవతలివైపు నుంచి ఎడ్లబండిపై తరలింపు
- పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు
బెల్లంపల్లి రూరల్/గోదావరిఖని, వెలుగు: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలాన్ని ఆనుకొని ఉన్న ప్రాణహిత నది ఫెర్రీ పాయింట్వద్ద బుధవారం 2 క్వింటాళ్ల 5 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు రామగుండం సీపీ శ్రీనివాసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామ గుండం సీపీ ఆఫీసులో ఆయన వివరాలు వెల్లడించారు. వేమలపల్లి మండలానికి చేరువలో ప్రాణహిత నది అవతలి వైపు ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కోటపల్లికి చెందిన కోల సాయి కిరణ్ నకిలీ పత్తి విత్తనాలను ఎడ్లబండి మీద ప్రాణహిత నది దాటించి వేమనపల్లి వైపుకు తరలిస్తున్నాడు.
మహారాష్ట్రకే చెందిన రమేశ్, సుమిత్, సంపత్‌లతో కలిసి జిల్లాలోని అమాయక రైతులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. సమాచారం అందుకున్నఎస్ఐ శ్యాంపటేల్, పోలీసులు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఫెర్రీ ఫాయింట్వద్దకు వెళ్లి ఎడ్లబండితో సహా అందులోని ఏడు సంచుల్లోని 2 క్వింటాళ్ల 5 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6.75 లక్షలు ఉంటుంది.
ఎడ్ల బండితో సహా సాయికిరణ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. రమేశ్, సుమిత్, సంపత్ పరారీలో ఉన్నారని సీపీ చెప్పారు. విత్తనాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, కానిస్టేబుల్స్ రాజేందర్, రాజశేఖర్‌ను సీపీ అభినందించి రివార్డు అందజేశారు. మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్రూరల్సీఐ సుధాకర్ పాల్గొన్నారు.