కామారెడ్డిలో రూ.1.65 లక్షల ఫేక్​ కరెన్సీ స్వాధీనం

కామారెడ్డి/భైంసా, వెలుగు: యూట్యూబ్ చూస్తూ దొంగ నోట్లను తయారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి నుంచి ఫేక్​ రూ.500 నోట్లు, రెండు బైక్​లు, టవేరా వెహికల్​తో పాటు నోట్ల తయారీకి కావాల్సిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్​పీ శ్రీనివాస్​రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. శుక్రవారం దేవునిపల్లి హైవేపై వెహికల్స్ చెక్​ చేస్తుండగా, నిజామాబాద్ వైపు నుంచి ఏపీ 09 బీఏ 8339 టవేరా వెహికల్​కామారెడ్డి వైపు వస్తున్నది. అందులో ఉన్న ఇద్దరు అనుమానితులు పోలీసులను చూసి పారిపోయేందుకు ట్రై చేశారు. పోలీసులు వెంబడించి పట్టుకుని ఎంక్వైరీ చేయగా.. వారు మతిన్ ఖాన్, షేక్​ హుస్సేన్ అని తేలింది. ఫేక్​ 500 రూపాయల నోట్లు తయారు చేసి దీపావళి హడావుడిలో మార్కెట్లో చెలామణి చేద్దామని ప్రయత్నించారు. దీనికి మరో ముగ్గురు సాయం చేశారు. నిర్మల్ జిల్లా భైంసా వెళ్లి ఆ ముగ్గురిని టాస్క్​ఫోర్స్​, దేవునిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను మహారాష్ట్ర నాందేడ్​ జిల్లా ధర్మాబాద్​కు చెందిన మహమ్మద్ ఉమర్, షేక్​ హుస్సేన్, నిజామాబాద్​ జిల్లా నాగారానికి చెందిన ఒబైద్​ ఖాన్​ పఠాన్, నిర్మల్​ జిల్లా భైంసాకు చెందిన మతిన్​ఖాన్, అబ్దుల్​ మోయిజ్​లుగా గుర్తించారు. వీరి నుంచి 330 ఫేక్​ 500 రూపాయల నోట్లు (రూ.1.65లక్షలు), డెస్క్​టాప్, కీ బోర్డు, ల్యామినేషన్​ మిషన్, కలర్​ ప్రింటర్, రంగుల డబ్బాలు, పేపర్లు, పేపర్​ కటింగ్​ మిషన్, రెండు బైక్​లు, టవేరా వెహికల్, 7 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. షేక్​ హుస్సేన్, మతిన్​ఖాన్​లు వృత్తిరీత్యా డ్రైవర్లు. వీరికి కంప్యూటర్​పై టెక్నికల్​గా ఎక్స్​పీరియన్స్​ ఉంది. వీరు భైంసా మీ సేవలో పనిచేస్తూ జిరాక్స్​ సెంటర్​ నడిపిస్తున్నరు. దొంగనోట్లు ఎలా తయారు చేస్తారో ఐదుగురు కలిసి యూట్యూబ్​లో చూసి నేర్చుకున్నారు. దానికి కావాల్సిన అన్ని వస్తువులు సమకూర్చుకుని నకిలీ 500 రూపాయల నోట్లను తయారు చేశారు. మీటింగ్​లో ఏఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం, కామారెడ్డి రూరల్ సీఐ శ్రీనివాస్, టాస్క్​ఫోర్స్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆఫీసర్లను ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే దొంగ నోట్ల ముఠా పట్టుబడడంతో భైంసా పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.