- సప్లై చేస్తానంటూ సిటీలో తిరుగుతున్న కామెరూన్ దేశస్థుడు
- హయత్ నగర్లో నిందితుడు అరెస్ట్
- ఫేక్ పాస్పోర్టుతో ఇండియాలో తిరుగుతున్నట్లు గుర్తింపు
ఎల్బీనగర్, వెలుగు: ఫేక్ కరెన్సీ సప్లై చేస్తానంటూ సిటీలో తిరుగుతున్న కామెరూన్ దేశస్థుడిని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చిన నిందితుడు తిరిగి వెళ్లకుండా తన ఫ్రెండ్ పాస్పోర్టుతో ఇక్కడే ఉంటున్నట్లు గుర్తించారు. హయత్ నగర్ సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. కామెరూన్ దేశానికి చెందిన జాక్వస్ డివోలిస్ కిట్ 2017 జులైలో టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చాడు.
టూరిస్ట్‌గా వచ్చినా తిరిగి వెళ్లకుండా బెంగళూరులో ఉంటూ ఒరిజినల్ క్యాష్ ఇస్తే దానికి డబుల్ నకిలీ ఇండియన్ కరెన్సీ ఇస్తానని 2020లో ఒకరిని చీట్ చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్లొచ్చినా తీరుమార్చుకోకుండా తన ఫ్రెండ్ ల్యాండ్రీ పాస్ పోర్టుతో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఈ క్రమంలో సిటీకి చెందిన రసూల్అనే వ్యక్తితో ఫేక్ కరెన్సీ సప్లై చేస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు.
రూ.5 లక్షల ఒరిజినల్ క్యాష్ ఇస్తే రూ.10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తానన్నాడు. అయితే, ఈ విషయాన్ని రసూల్పోలీసులకు చెప్పగా, శుక్రవారం హయత్ నగర్ లోని చైత్ర లాడ్జిలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నకిలీ పాస్ పోర్ట్, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. మరో నిందితుడు ల్యాండ్రీ కోసం గాలిస్తున్నాడు. అయితే, నిందితుడు ఫేక్ కరెన్సీ కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.