కోదాడలో నకిలీ డాక్టర్​ అరెస్ట్

కోదాడ, వెలుగు : నకిలీ సర్టిఫికెట్ తో ఆస్పత్రి నడిపిస్తున్న  డాక్టర్​ను కోదాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ రాము వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన వన్న యశ్వంత్ కుమార్ ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదివాడు. అయితే, దేశంలో ప్రాక్టీస్ చేసేందుకు ఎంసీఐ నిర్వహించే పరీక్ష పాస్ కాలేకపోయాడు. ఎలాగైనా ఆస్పత్రి పెట్టి వైద్యం చేయాలని యశ్వంత్​కుమార్ నిర్ణయించుకున్నాడు. 

తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ పేరిట ఆయన నకిలీ సర్టిఫికెట్ తయారు చేశారు. అనంతరం కోదాడలో శ్రీహృదయ హాస్పిటల్ పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నాడు. హాస్పిటల్ రిజిస్ర్టేషన్ కోసం డీఎంహెచ్ వోకు దరఖాస్తు చేసుకున్నాడు. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వెబ్ సైట్ లో తనిఖీ చేయగా, అది నకిలీ సర్టిఫికెట్ అని తేలింది. ఎంసీఐలో రిజిస్టేషన్ నంబర్ కర్నాటకలోని కోలార్ లో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ జి.యశ్వంత్ కుమార్ గా తెలిసింది. దీనితో మే 2న శ్రీహృదయ హాస్పిటల్ ను డీఎంహెచ్ వో సీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కోదాడ పట్టణ పోలీసులు యశ్వంత్ కుమార్ ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.