డిగ్రీ ఫెయిల్.. ఎండీ డాక్టర్​గా అవతారం

  •     రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్​ఫిర్యాదుతో నకిలీ డాక్టర్ అరెస్టు
  •     డిగ్రీ కూడా పూర్తిచేయలేదని గుర్తించిన పోలీసులు

కామారెడ్డి, వెలుగు :  డిగ్రీ ఫెయిలైన ఓ వ్యక్తి ఎండీ డాక్టర్​గా అవతారమెత్తాడు. కామారెడ్డి జిల్లాలో రెండేండ్లుగా  డాక్టర్​గా చలామణి అవుతున్న ఆ వ్యక్తిని తెలంగాణ మెడికల్​కౌన్సిల్ రిజిస్ట్రార్​ఫిర్యాదుతో కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గురువారం టౌన్​ పోలీస్ స్టేషన్​లో ఏఎస్పీ బి.చైతన్యరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్​కు చెందిన ముల్కల రవీందర్.. ఎల్.రవీందర్​రెడ్డిగా చలామణి అవుతున్నాడు. తాను ఎంబీబీఎస్, ఎండీ జనరల్​మెడిసిన్, పీడియాట్రీషియన్​చదివినినట్లు  నకిలీ సర్టిఫికెట్లు సృష్టించుకొని డాక్టర్​గా హాస్పిటల్స్​లో పని చేస్తున్నాడు.

కానీ టెన్త్, ఇంటర్​రెండోసారికి పాసైన రవీందర్ ​డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ఇంటర్​తర్వాత డిగ్రీలో చేరిన అతడు.. కుటుంబ సభ్యులకు మాత్రం తాను ఎంబీబీఎస్​ చదువుతున్నట్లు చెప్పాడు. సికింద్రాబాద్​లోని గాంధీ హాస్పిటల్​కు అప్పుడప్పుడు వెళ్లేవాడు.  మందమర్రిలో తనకు తెలిసిన ఓఆర్ఎంపీ వద్దకు వెళ్లి ట్రీట్​మెంట్​ఎలా చేస్తారనేది గమనించేవాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆన్​లైన్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్​ఇచ్చే సర్టిఫికెట్లను పరిశీలించాడు. వాటిల్లో తన పేరుకు దగ్గరగా ఉన్న  డాక్టర్​రవీందర్​రెడ్డికి సంబంధించిన డాక్టర్​సర్టిఫికెట్లను డౌన్​లోడ్​ చేసుకున్నాడు. ఫొటో షాప్​లో ఎడిట్​చేసి తన ఫొటో పెట్టుకున్నాడు.

దీనికి తగ్గట్లుగానే  ఆధార్​ కార్డులో కూడా తన పేరు రవీందర్​రెడ్డి, తండ్రి బాల్​రెడ్డిగా పేరు మార్చుకున్నాడు. కన్సల్టెంట్​ద్వారా  కామారెడ్డి గోదాం రోడ్డులోని స్టార్​హాస్పిటల్​లో ఎండీ డాక్టర్​గా చేరాడు. ఇక్కడ 2023 మార్చి నుంచి జూలై వరకు పనిచేశాడు. 2 ‌‌‌‌ఆగస్టు నుంచి 2024 జనవరి వరకు కామారెడ్డిలోని ఆరోగ్య హాస్పిటల్​లో, 2024 ఫిబ్రవరి నుంచి జూలై వరకు లింగంపేట మండల కేంద్రంలోని భీంరాజు హాస్పిటల్​లో పనిచేశాడు. ఆగస్టు నుంచి మళ్లీ స్టార్​హాస్పిటల్​లో చేరి పనిచేశాడు. ఆ తర్వాత ఖానాపూర్​లోని షణ్ముక హాస్పిటల్​లో పీడియాట్రీషియన్​ గా పని చేసేందుకు ఈ నెల 6న రూ.2 లక్షలు అడ్వాన్స్​తీసుకున్నారు.

తెలంగాణ మెడికల్ కౌన్సిల్​రిజిస్ట్రార్​డాక్టర్ బందెం లాలయ్య కుమార్​ బుధవారం స్టార్​హాస్పిటల్​లో తనిఖీ చేశారు. ఇక్కడ పని చేసే రవీందర్​రెడ్డి అసలు డాక్టర్​కాదని గుర్తించారు. ఫేక్ సర్టిఫికెట్లతో డాక్టర్​గా చలామణి అవుతున్నారని గుర్తించి టౌన్​పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నకిలీ డాక్టర్​గురించి ఆరా తీయగా  అప్పటికే అతను హాస్పిటల్​వదిలి వెళ్లిపోయినట్లు గుర్తించారు.

టౌన్​సీఐ చంద్రశేఖర్​రెడ్డి ఆధ్వర్యంలో వెతికి ఇతడిని గురువారం అరెస్టు చేశారు. ఫేక్​ఆధార్​కార్డు, ఫేక్ సర్టిఫికెట్లు,సెల్​ఫోన్, ల్యాప్​ట్యాప్​ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. ఎంక్వైరీ చేస్తున్నామని, హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్​తీసుకున్న రోగుల గురించి ఆరా తీస్తున్నారు. సమావేశంలో టౌన్​సీఐ చంద్రశేఖర్​రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.