- బోగస్ సర్టిఫికెట్లతో సూపర్ స్పెషాలిటీ దందా
- వాడకో క్లినిక్.. ఊరికో నర్సింగ్ హోమ్..
- మండలానికో స్పెషాలిటీ హాస్పిటల్
- బోర్డులపైనే ‘స్పెషలైజేషన్లు’..
- చికిత్స చేసేది ఆర్ఎంపీలు, పీఎంపీలు
- టెన్త్ క్లాస్ చదివినోళ్లూ డెలివరీలు..
- ఆన్‌లైన్‌లో చూసి మందులు
- హోమియో, ఆయుర్వేదం చదివి అల్లోపతి వైద్యం
- పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం..
- వచ్చిన వైద్యం చేసి, అందిన కాడికి దోపిడీ
వెలుగు, మంచిర్యాల / నెట్‌వర్క్: రాష్ట్రంలో ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’లు పెరిగిపోతున్నరు. బోగస్, నకిలీ సర్టిఫికెట్లతో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు పెట్టేస్తున్నారు. పదో తరగతి చదివిన వాళ్లు కూడా సంతాన సాఫల్య కేంద్రాలు తెరిచి.. డెలివరీలు, అబార్షన్లు చేసేస్తున్నారు. ఎంబీబీఎస్‌లు, ఎండీలు, సర్జన్ల అవతారం ఎత్తేసి సర్జరీలు చేస్తున్నారు. ఆర్ఎంపీలు, అంబులెన్స్ ఓనర్లు, లీడర్లు, రియల్టర్లు, బిల్డర్లు, ఫైనాన్షియర్లు, వ్యాపారులు కూడా హాస్పిటళ్లు పెట్టేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. స్పెషలిస్టు డాక్టర్లు ఉన్నారంటూ పేషెంట్లను చేర్చుకోవడం, తమకు తెలిసిన వైద్యం చేయడం, అందినకాడికి దోచుకోవడం, పేషెంట్ కండీషన్ సీరియస్ అయితే హైదరాబాద్ రిఫర్ చేసి చేతులు దులుపుకోవడం వీళ్లకు అలవాటైపోయింది. దీంతో సరైన వైద్యం అందక పేషెంట్లు మార్గమధ్యలోనే చనిపోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి.
పుట్టగొడుగుల్లా ప్రైవేట్ హాస్పిటళ్లు
రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చిన్న టౌన్లు, మండల కేంద్రాల్లోనూ సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ పేర్లతో వెలుస్తున్నాయి. కానీ మెజారిటీ హాస్పిటళ్ల బోర్డులపై ఉండే స్పెషలిస్టులు.. ఆస్పత్రి లోపల కనిపించడం లేదు. వారి స్థానంలో అర్హతలు లేని డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎంబీబీఎస్‌లు.. ఎండీలుగా, సర్జన్లుగా చలామణి అవుతుంటే, ఇంకొన్ని చోట్ల హోమియో, ఆయుర్వేద డాక్టర్లు స్పెషలిస్టులుగా చెప్పుకుంటూ వైద్యం చేస్తున్నారు. చాలా చోట్ల ఆర్ఎంపీలు, పీఎంపీలు నర్సింగ్‌హోమ్‌లు నిర్వహిస్తున్నారు.
సరైన అర్హతలు లేకున్నా పేషెంట్లను చేర్చుకొని ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అదృష్టం బాగుండి రోగి ఆరోగ్యంతో బయటపడితే తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. పరిస్థితి విషమిస్తే హైదరాబాద్‌కు రెఫర్ చేసి చేతులుదులుపుకుంటున్నారు. పేషెంట్ అక్కడే చనిపోతే లక్షల్లో డబ్బులిచ్చి సెటిల్‌మెంట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి ప్రైవేట్ హాస్పిటళ్లను కంట్రోల్ చేయాల్సిన మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు.. అది తమ పని కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చాలా హాస్పిటళ్లకు, వాటికి అనుబంధంగా ఉన్న ల్యాబ్‌లు, స్కానింగ్‌సెంటర్లు, మెడికల్ షాపులకు రిజిస్ర్టేషన్లు, పర్మిషన్లు లేకున్నా పట్టించుకోవడం లేదు. పేషెంట్ల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. ఏదైనా కంప్లైంట్ వస్తే హాస్పిటల్ సీజ్ చేసి, అక్కడితో వదిలేస్తున్నారు. వాటిపై ఎలాంటి కేసులు పెట్టకపోవడంతో ఓనర్లు మళ్లీ రీ ఓపెన్‌చేసి దర్జాగా రన్చేస్తున్నారు.
ఎండీలుగా ఫారిన్ డాక్టర్లు
చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్‌లాంటి దేశాల్లో మెడిసిన్ చదివితే అక్కడ ఎండీ సర్టిఫికెట్ ఇస్తారు. అది ఇండియాలో ఎంబీబీఎస్‌తో సమానం. వాళ్లు కూడా ఇక్కడి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్వహించే టెస్ట్ పాస్ అయితేనే ఎంబీబీఎస్ హోదాలో ప్రాక్టీస్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. బోర్డుపై ‘ఎండీ ఫిజీషియన్’ అని రాసుకుంటే పక్కన వారు చదివిన దేశం పేరు, ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్ అని తప్పకుండా పేర్కొనాలి. కానీ పలువురు ఈ విషయాన్ని దాచిపెట్టి ఎండీ అని బోర్డు తగిలించుకుంటున్నారు. మరికొందరు ఎంసీఐ టెస్ట్ క్వాలిఫై కాకుండానే ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఇటీవల ఒక డాక్టర్ ఎండీ అని బోర్డు పెట్టుకొని నర్సింగ్‌హోమ్ నిర్వహించాడు. ఆఫీసర్లు తనిఖీలు చేయగా.. రష్యన్ డిగ్రీగా తేలింది. ఎంసీఐ గుర్తింపు లేకపోవడంతో నోటీసులు ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విదేశాల్లో చదివిన ఓ డాక్టర్.. ఇక్కడ ఎంసీఐ గుర్తింపు లేకుండానే ఎండీ అని బోర్డు పెట్టుకుని నర్సింగ్‌హోమ్ స్టార్ట్ చేశాడు. స్థానికులు డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయడంతో నోటీసులు ఇచ్చి వదిలేశారు. జనగామ జిల్లా కేంద్రంలో ఇలాంటి మూడు హాస్పిటల్స్నడుస్తున్నాయి. మంచిర్యాలలో పది మందికిపైగా ‘ఫారిన్ డాక్టర్లు’ ఉండగా, వీరిలో కొందరు స్పెషలిస్టులుగా చలామణీ
అవుతున్నారు.
మంచి వ్యాపారమని..
వైద్యం వ్యాపారంగా మారడంతో సంపాదన కోసం చాలామంది హాస్పిటళ్లు తెరుస్తున్నారు. ఒకరిద్దరు డాక్టర్లను పట్టుకొని దందా నడిపిస్తున్నారు. మంచిర్యాలలో ఇటీవల 50 మందికి పైగా కలిసి ఒక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు. ఇదే రీతిలో కొందరు మరో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తెరిచారు. అంబులెన్స్ ఓనర్లు మూడు హాస్పిటళ్లు నడుపుతున్నారు. పేషెంట్లను తీసుకొస్తే ఆర్ఎంపీలకు, అంబులెన్స్ డ్రైవర్లకు 30 నుంచి 50 శాతం కమీషన్లు, లక్షల్లో అడ్వాన్సులను ప్రైవేట్ హాస్పిటళ్ల నిర్వాహకులు ఇస్తున్నారు. గోవా, ఇతర ప్రాంతాలకు ట్రిప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపెల్లికి చెందిన ఓ యువకుడికి నిరుడు కరోనా సోకగా ఒక ఆర్ఎంపీ ట్రీట్‌మెంట్ ఇచ్చాడు.
వారం రోజులకు యువకుడి పరిస్థితి విషమించి చనిపోయాడు. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు వరంగల్ సిటీలో తనిఖీలు చేసి.. ఏడు క్లినిక్‌లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కొందరు స్పెషలిస్టులు డబ్బుల కక్కుర్తితో తమ పేరుతో పర్మిషన్ తీసుకొని ఆర్ఎంపీలు, ఎంబీబీఎస్‌లకు క్లినిక్‌లు అప్పగిస్తున్నారు. గత డిసెంబర్‌లో కమలాపూర్ మండల కేంద్రంలో కమల పాలిక్లినిక్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జిల్లా వైద్యాధికారులు తనిఖీలు చేయగా.. ఇలాంటి బాగోతం బయటపడింది. ఆఫీసర్లు క్లినిక్‌ను సీజ్ చేసినా ఇందుకు కారణమైన డాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరీంనగర్‌లో ఏకంగా 10కి పైగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను డాక్టర్లు కాకుండా ఇతరులు నడుపుతున్నారంటే వైద్యం ఎంతలా వ్యాపారంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
12 ఏండ్లుగా రేడియాలజిస్టు
నల్గొండ జిల్లా కేంద్రంలో ఫేక్ రేడియాలిజిస్ట్ బాగోతం బయటపడింది. అపర్ణారెడ్డి అనే వ్యక్తి 12 ఏండ్ల నుంచి బోగస్ సర్టిఫికెట్ అడ్డం పెట్టుకుని అపర్ణ స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆమె భర్త మూల హుస్సేన్ రెడ్డి అర్థోపెడిక్ డాక్టర్. కార్పొరేట్ స్థాయిలో భార్యాభర్తలిద్దరూ హాస్పిటల్ నడుపుతున్నారు. అపర్ణారెడ్డి సర్టిఫికెట్ బోగస్ అని మూడేండ్ల కిందటే వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోలేదు. పైగా ఆమె తన సర్టిఫికెట్‌ను ప్రతి ఐదేళ్లకోసారి రెన్యూవల్ చేయించుకుంటున్నారు. లోకల్‌గా ఉన్న కొందరు డాక్టర్లకు కమీషన్లు ఇచ్చుకుంటూ టెస్టులు, స్కానింగుల దందా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మరో వర్గానికి చెందిన డాక్టర్లు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేసి అపర్ణది నకిలీ సర్టిఫికెట్ అని తేల్చారు.
వెస్టిండీస్‌లో ఎండీ చదివినట్లు సర్టిఫికెట్ సృష్టించి రోగులను ఆమె మోసం చేస్తున్నట్లు గుర్తించారు. బుధవారం స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేసేందుకు ఆఫీసర్లు వెళ్లగా.. వాగ్వాదానికి దిగారు. హైకోర్టు లాయర్‌తో హాస్పిటల్ యాజమాన్యం ఫోన్ చేయించడంతో ఆఫీసర్లు వెనక్కి వెళ్లిపోయారు. దీంతో ఆఫీసర్లపై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో గురువారం స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. స్కానింగ్ సెంటర్, అపర్ణారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం టుటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
టెన్త్ చదివి ఆపరేషన్లు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లోని శ్రీ పూజిత ప్రైవేట్ హాస్పిటల్‌లో ‘సంతాన సాఫల్య, ప్రసూతి కేంద్రం’ నడుస్తోంది. స్కానింగ్, ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది. ‘ఉషారాణి బీఏఎంఎస్’ అని చెప్పుకునే డాక్టర్.. డెలివరీలు, అబార్షన్లు చేసేస్తున్నారు. యాదాద్రి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేయగా.. ఉషారాణి అసలు డాక్టరే కాదని తేలింది. పేషెంట్లు రాగానే తనకు తోచిన వైద్యం చేస్తోందని, తెలియకుంటే ఆన్‌లైన్‌లో ఇంకో డాక్టర్‌ను సంప్రదించి టెస్టులు, మందులు రాస్తోందని తెలిసి అడిషనల్ కలెక్టర్ ఆశ్చర్యపోయారు. మరింత విచారణ చేయగా.. ఆమె పదో తరగతి మాత్రమే చదివిందని, గతంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి 93 రోజులు జైలుకు కూడా వెళ్లొచ్చిందని బయటపడింది. దీంతో హాస్పిటల్‌ను సీజ్‌చేసి, పోలీసుల సాయంతో దర్యాప్తు ప్రారంభించారు.
పర్మిషన్ రాకముందే ట్రీట్‌మెంట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో గతేడాది ఓ ప్రైవేట్ హాస్పిటల్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ పర్మిషన్ రాకముందే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు. నాలుగు నెలల తర్వాత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. అప్లై చేసుకున్న డాక్టర్ అక్కడ లేకపోవడంతో హాస్పిటల్‌ను సీజ్ చేశారు.
నారాయణపేట జిల్లాలో పది మందికి పైగా బీహెచ్ఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్, సర్జరీ) డాక్టర్లు.. పిల్లల స్పెషలిస్టులుగా చలామణీ అవుతున్నారు. ఆరు హాస్పిటల్స్‌లో ఎంబీబీఎస్ డాక్టర్లు డయాబెటిక్ స్పెషలిస్టులుగా చెప్పుకుంటూ వైద్యం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో వంశీ న్యూరో హాస్పిటల్‌లో అసలు న్యూరో స్పెషలిస్టులు లేరు. ఓ సైకియాట్రిస్ట్‌తోపాటు ఆర్ఎంపీ సేవలందిస్తున్నారు. మూన్నెళ్ల కింద డీఎంహెచ్‌వోకు కంప్లైంట్ రావడంతో తనిఖీలు చేసి సీజ్ చేశారు. కానీ నిందితులపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టలేదు.
మెదక్‌లో 20 దాకా ప్రైవేట్ హాస్పిటళ్లు ఉన్నాయి. ఇటీవల మల్టీ స్పెషాలిటీ పేరుతో మరో మూడు వెలిశాయి. క్రిటికల్ కేర్, న్యూరో, కార్డియాక్, డయాబెటిక్, పీడియాట్రిక్ ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. బోర్డుల మీద పేర్లున్న డాక్టర్లు హాస్పిటళ్లలో కనిపించడం లేదు. కొన్నింట్లో వారానికి ఒక రోజు హైదరాబాద్ నుంచి స్పెషలిస్టులు వచ్చి వెళ్తున్నారు. కొన్ని హాస్పిటళ్లు అత్యవసర సమయాల్లో లోకల్‌గా ఉన్న స్పెషలిస్టులను పిలిపిస్తున్నాయి.
మంచిర్యాల జిల్లాలో పబ్లిక్ ఫిర్యాదుల మేరకు కలెక్టర్ ఐదు టీమ్స్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తే.. ఏకంగా 42 హాస్పిటళ్లకు పర్మిషన్లు లేవని బయటపడింది. వీరిలో కొందరికి ఫైన్లు వేసి టెంపరరీ పర్మిషన్లు ఇవ్వగా.. మరో 15 హాస్పిటళ్లు, ల్యాబ్‌లను మూసివేశారు.