- రెవెన్యూ శాఖ ఉద్యోగిగా ఫేక్ ఐడీ చేసుకున్న భాస్కర్ రావు
- అదుపులోకి తీసుకున్నఎస్పీఎఫ్ సిబ్బంది
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సెక్రటేరియెట్లో నకిలీ ఉద్యోగుల వ్యవహారం కలకలం రేపింది. ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ఎంట్రీ ఇస్తున్న సదరు వ్యక్తులు.. ఉద్యోగుల పేరిట దర్జాగా తిరుగుతూ హల్చల్ చేశారు. సెక్షన్ ఆఫీసుల్లో పనులు చేయిస్తామంటూ దందాలకు దిగారు. నకిలీ ఉద్యోగుల సమాచారంతో సచివాలయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నకిలీ ఉద్యోగుల కదలికలపై సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాలతో ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత చాకచక్యంగా ఓ నకిలీ ఉద్యోగిని ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు... రెవెన్యూ శాఖ ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చెలామణి అవుతున్నట్లు గుర్తించారు. ఇటీవలి కాలంలో సెక్రటేరియెట్లోని అన్ని ఫ్లోర్లలో విజిటర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. ఈ క్రమంలో పాసులు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తూ ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పేరుతో నకిలీ ఐడెంటిటీ కార్డులతో కొందరు వ్యక్తులు లోపలికి వెళ్తున్న విషయం బయటకు వచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ మీడియా సమావేశంలో ఉద్యోగి పేరిట హల్చల్ చేస్తున్న భాస్కర్ రావును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బట్టబయలైంది.