బషీర్ బాగ్, వెలుగు: ఛత్తీస్ గఢ్ లో కొనసాగుతున్న బూటకపు ఎన్ కౌంటర్లను తక్షణమే నిలిపివేయాలని పలువురు పౌర హక్కుల సంఘం నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణరావు, హైకోర్టు న్యాయవాది సురేశ్ కుమార్, చైతన్య మహిళా సంఘం వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ జి. జ్యోతి కలిసి మాట్లాడారు. 13 నెలల కాలంలో 352 మందిని ఎన్ కౌంటర్ లో చంపితే ఇందులో ఆదివాసీ గిరిజనులే 300 మందికి పైగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మనిషి జీవించే హక్కు పట్ల ఏ ప్రభుత్వమైనా బాధ్యతయుతంగా ఉండాలే తప్ప వెంటాడి చంపడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. ఆపరేషన్ కగార్ హత్యాకాండ ఆపివేసి, ఆదివాసీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 600 క్యాంపులను తక్షణమే ఎత్తివేయాలన్నారు. ఆదివాసీ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంఘాలు స్పందించి ఛత్తీస్ గఢ్ లో ప్రజాస్వామిక వాతావరణం నెలకొనేందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.