యాక్టర్ సోనూసూద్ పేరుతో ఫేక్ ఫౌండేషన్

యాక్టర్ సోనూసూద్ పేరుతో ఫేక్ ఫౌండేషన్
  • ఆర్థిక సాయం చేస్తామంటూ ట్రాప్
  • రూ.60 వేలు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్
  • పోలీసులకు కంప్లయింట్ చేసిన బాధితుడు

గచ్చిబౌలి,వెలుగు: యాక్టర్ సోనూసూద్ పేరుతో ఫేక్  ఫౌండేషన్ నంబర్  ను సోషల్ మీడియాలో పెట్టి ఆర్థిక సాయం కోరిన సిటీకి చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్ క్రిమినల్స్ డబ్బులు కొట్టేశారు. లాక్ డౌన్ టైమ్ నుంచి  యాక్టర్ సోనూసూద్ కష్టాల్లో ఉన్న వారి గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని  సాయం చేస్తున్న విషయం తెలిసిందే.  శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(48) ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. ఇటీవల  అతడికి ఆర్థిక ఇబ్బందులు రావడంతో  సోనూసూద్ ఫౌండేషన్ కోసం ట్విటర్ లో సెర్చ్ చేశాడు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో ఓ నంబర్ కనిపించడంతో దానికి కాల్ చేశాడు. కాల్ రిసీవ్ చేసుకున్న అవతలి వ్యక్తి తన పేరు పంకజ్ సింగ్ బహుదూరియా అని, తాను సోనూసూద్ అడ్వయిజర్ నని చెప్పాడు. వాట్సాప్ లో ఐడీ కార్డు పంపించాడు. దీన్ని నమ్మిన బాధితుడు తనకు రూ.10 వేలు ఆర్థిక సాయం కావాలని కోరాడు. ఇందుకోసం ఆధార్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్ పంపించాలని పంకజ్ సింగ్ బాధితుడికి తెలిపాడు.  తన ఫ్యామిలీ అధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్ వివరాలను బాధితుడు పంకజ్ సింగ్ వాట్సాప్ కి పంపాడు. సోనూసూద్మీ ఫ్యామిలీ గురించి ఎంక్వయిరీ చేసి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించేందుకు ఒప్పుకున్నారని, ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఫీజు రూ.8,300 చెల్లించాలని పంకజ్ సింగ్ ఈ నెల1న బాధితుడికి కాల్ చేసి చెప్పాడు. దీంతో అతడు ఆ డబ్బులను చెల్లించాడు. తర్వాత పంకజ్ సింగ్ మళ్లీ బాధితుడికి కాల్ చేసి మీకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.3 లక్షల 60 వేలకు పెంచామని,   జీఎస్టీ, ఇతర రిజిస్ర్టేషన్ల ఫీజులు చెల్లించాలని చెప్పి  మొత్తం రూ.60 వేలు వసూలు చేశాడు. మరోసారి పంకజ్ సింగ్ కాల్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి రూ.7,900 చెల్లించాలని చెప్పడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు ఈ నెల 3న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పేదలకు హెల్ప్ చేస్తామంటూ సెలబ్రిటీలు, ఆర్గనైజేషన్ల నుంచి వచ్చే ఫేక్ కాల్స్, మెసేజ్ లను నమ్మొద్దని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. రిజిస్ట్రేషన్ల పేరుతో డబ్బులు చెల్లించాలని అడిగితే సైబర్ చీటింగ్ గా గుర్తించాలన్నారు. పోలీసులకు కంప్లయింట్ చేసేందుకు  9490617310, వాట్సాప్నం. 9490617444కు సంప్రదించాలన్నారు.