- నాకు ఫోన్ పే చేయండి.. లేదంటే షాప్ సీజ్ చేస్తా..
- ఇల్లందు మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫేక్ కాల్స్
- అప్రమత్తమై వెంటనే పోలీసులకు ఫిర్యాదు
ఇల్లెందు, వెలుగు: “ హలో.. నేను ఇల్లెందు మున్సిపల్ కమిషనర్‌ను.. మీ షాప్ ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేయాలి.. లేదంటే షాపును సీజ్‌చేస్తాం. వెంటనే నాకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపండి”అంటూ ఓ వ్యక్తి గురువారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు టౌన్ లో పలు షాపుల నిర్వాహకులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా ఓ షాపు నిర్వాహకుడు నిజమేననుకుని ఫోన్ పే ద్వారా రూ.4 వేలు ట్రాన్స్ ఫర్ చేసినట్టు తెలిసింది. అలర్టైన మున్సిపల్ అధికారులు వెంటనే ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సైబర్ నేరగాడు నంబర్ 6305270329 నుంచి కాల్ చేసినట్టు కంప్లయింట్ లో తెలిపారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ... షాపు ట్రేడ్ లైసెన్సులకు ఎవరు ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ పే చేయమంటే చేయవద్దని వ్యాపారులకు సూచించారు. మున్సిపల్ ఆఫీసు నుంచి ఎవరూ ఫోన్ చేయరని స్పష్టం చేశారు. అపరిచిత వ్యక్తి ఫోన్ చేసినా స్పందించవద్దని, వ్యాపారులు మున్సిపల్ ఆఫీసుకు వచ్చి నిర్ధారించుకోవాలని తెలిపారు. తొందర పడి ఎవరు కూడా డబ్బులు ఫోన్ పే చేసి నష్టపోవద్దని, ఏదైనా అనుమానం వస్తే పోలీసులు ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యాపారులు షాపుల ట్రేడ్ లైసెన్స్‌ల కోసం తమ సిబ్బంది వస్తే గాని, మున్సిపల్ ఆఫీసుకు నేరుగా వచ్చి చెల్లించాలని చెప్పారు. మోసగాడు చేసిన ఫోన్ నంబర్ కు మున్సిపల్ సిబ్బంది ఫోన్ చేయగా ‘ నేను ఇల్లెందు మున్సిపల్ కమిషనర్’ అని బుకాయించడం గమనార్హం.