వెన్నంటే తిరిగాడు.. పవన్ మన్యం టూర్‌లో ఫేక్ ఐపీఎస్ అధికారి

వెన్నంటే తిరిగాడు.. పవన్ మన్యం టూర్‌లో ఫేక్ ఐపీఎస్ అధికారి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో ఫేక్ ఐపీఎస్ అధికారి హల్‌చల్ చేశాడు. ఓ వ్యక్తి తాను ఐపీఎస్ ఆఫీసర్‌నని చెప్పుకుని పవన్ వెంటే తిరిగాడు. తీరా చూస్తే అతను ఫేక్ ఐపీఎస్ అధికారి అని తేలింది. ఇప్పుడీ వ్యవహారం ఏపీ అంతటా హాట్ టాపిక్‌గా మారింది.

పవన్ సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో పర్యటించిన సమయంలో ఫేక్ ఐపీఎస్ అధికారి ఆయన వెన్నంటే ఉన్నారు. నిజమైన ఐపీఎస్ అధికారిలా కింది స్థాయి సిబ్బందితో ఫోటోలుకు ఫోజులిచ్చారు. అధికారులు కూడా అతను నిజమైన ఐపీఎస్ ఏమో అనుకోని మౌనం వహించారు. ఇంతలా కింది స్థాయి సిబ్బందితో కలుపుగోలు తనం ఉన్న పోలీస్ అధికారి ఎవరా..? అని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. 

సదరు నకిలీ వ్యక్తిని గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్‌గా పోలీసులు గుర్తిచారు. ఇప్పటికి అతన్ని అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. గతంలో అతడు పార్వతీపురం డివిజన్‌లో తూనికలు, కొలతల విభాగంలో పనిచేసినట్లు పోలీసులు తేల్చారు. ఉన్నట్టుండి అతను ఎందుకు ఐపీఎల్ అధికారి అవతారం ఎత్తారనేది అంతుపట్టని విషయం.

ALSO READ : ఎంపీడీఓపై దాడి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు

పవన్ పర్యటించిన ప్రాంతం ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ఉన్న సమస్యాత్మక ఏజెన్సీ ప్రాంతం. ఈ నేపథ్యంలో ప్రతి చెక్‌పోస్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయినప్పటికీ, నిందితుడు పవన్ భద్రతా బృందంలోకి ప్రవేశించాడంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అద్దం పడుతోంది. ఇప్పటికే పవన్ పర్యటనల్లో భద్రత విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్న సమయంలో ఈ ఘటన మరింత చర్చనీయాంశం అవుతోంది.