హీరో సూర్య నటించిన గ్యాంగ్ మూవీ తరహాలో ఓ దొంగల ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. ఐటీ అధికారులమంటూ బంగారం షాపు యజమానిని నమ్మించారు. అదును చూసి చెతికందిన బంగారంతో ఉడాయించారు. మరిన్ని వివరాలను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి వెల్లడించారు. ఐటీ అధికారుల ముసుగులో బంగారు దుకాణంలో దోపిడీకి పాల్పడ్డ మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిమని ఆమె తెలిపారు.
నిందితుల నుండి రూ.60 లక్షల విలువైన 1700 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దోపిడీ కేసులో మొత్తం 10 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుండి అపహరించిన మొత్తం గోల్డ్ బిస్కట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గోవా, మహారాష్ట్ర లోని ఖానాపూర్ ప్రాంతానికి చెందిన గణపతి రావు జాదవ్, రుషికేశ్ వినోద్ జాదవ్, శుభం వినోద్ జాదవ్, సంజయ్ పరుశురాంలను మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ వివరించారు.
పాట్ మార్కెట్లోని సిద్ధి వినాయక బంగారు దుకాణంలో పనిచేసే జకీర్ అనే వ్యక్తి దోపిడీకి కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జాకీర్ మహారాష్ట్రలోని ఖానాపూర్ చెందిన తన స్నేహితులు, గోవాలో నివాసం ఉన్న స్నేహితులతో దోపిడీకి పథకం వేశాడని తెలిపారు. మూడు రోజులపాటు రెక్కీ నిర్వహించిన అనంతరం దోపిడీ చేసినట్లు తెలిపారు.
తర్వాత ఒక లాడ్జిలో ఉండి గోవాకు పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశామని, గతంలో విజయవాడలో కూడా ఇదే మాదిరిగా దోపిడీ యత్నానికి ప్రయత్నించి విఫలమయ్యారని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన జకీర్ తల్లిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశాని నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి వివరించారు.