6,881 పోస్టులతో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్

6,881 పోస్టులతో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్
  • ఆ ప్రకటన గ్రామీణాభివృద్ధి  శాఖ ఇవ్వలేదు: సెర్ప్​ సీఈవో

హైదరాబాద్, వెలుగు: నేషనల్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్(ఎన్ఆర్డీఆర్ఎమ్), కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేరిట వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్ అని సెర్ప్​(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఎన్ఆర్డీఆర్ఎమ్ పేరుతో ఎలాంటి విభాగం కానీ, పథకం కానీ లేదని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎన్ఆర్డీఆర్ఎమ్ పేరిట వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన ఫేక్ అని న్యూస్ చెకర్ ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలోనూ తేలిందన్నారు. 

అందువల్ల దానికి నిరుద్యోగులు ఎవరూ దరఖాస్తు చేసుకోవద్దని హెచ్చరించారు. ఇటీవల 6,881 పోస్టులతో ఫేక్ జాబ్ నోటిఫికేషన్ వచ్చిందని దివ్య దేవరాజన్  చెప్పారు. ఇది నిజమని నమ్మి ఏపీ, తెలంగాణలోని కొందరు నిరుద్యోగులు అప్లై చేసుకున్నారని వివరించారు. విషయం రూరల్ డెవలప్ మెంట్ అధికారులకు తెలియడంతో వారు ఆ నోటిఫికేషన్ ఫేక్ అని తేల్చినట్లు వెల్లడించారు. 

నిరుద్యోగులను మోసం చేయటానికే ఇలాంటి ప్రకటన ఇచ్చారని, ఇలాంటి వాటి పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని సీఈవో సూచించారు. ఫేక్ ప్రకటన ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర అధికారులను, సైబర్ క్రైమ్ పోలీసులను కోరామన్నారు. నకిలీ నోటిఫికేషన్లను లేదా వాటి వెబ్‌‌‌‌సైట్ వివరాలను తప్పకుండా ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని దివ్య దేవరాజన్ సూచించారు.