హైదరాబాద్ సిటీలో మరో భారీ మోసం బయటపడింది. జూబ్లీహిల్స్ లో జాగృతి కన్సల్టెన్సీ పేరుతో ఓ ఐటీ కంపెనీ ఉంది. ఉద్యోగాలు ఇస్తాం.. ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ భారీ ఎత్తున డిజిటల్ అండ్ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. నమ్మిన నిరుద్యోగులు కంపెనీకి పోటెత్తారు. ఇక్కడే తన కుట్రను అమలు చేసింది జాగృతి కన్సల్టెన్సీ.
ఉద్యోగం ఊరికే రాదు.. 2 లక్షల రూపాయల డిపాజిట్ చేయాలని కండీషన్ పెట్టింది. ఐటీ కంపెనీ.. ఐటీ కంపెనీలో ఉద్యోగం కదా అని.. 12 వందల మంది నిరుద్యోగులు.. తలా 2 లక్షల రూపాయలు కట్టారు. 2 లక్షలు కట్టినోళ్లకు ఫేక్ ఆఫర్ లెటర్స్ తో ఉద్యోగాలు ఇచ్చింది.. ఆఫీసుల్లో సీట్లు కూడా ఏర్పాటు చేసింది. కాకపోతే జీతాలు మాత్రమే ఇవ్వలేదు.. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవటంతో కంపెనీని నిలదీశారు ఉద్యోగులు. జీతాలు అయినా ఇవ్వండి లేదంటే మేం కట్టిన 2 లక్షల రూపాయలు అయినా తిరిగి ఇవ్వండి అంటూ డిమాండ్ చేశారు.
పరిస్థితులు చేయిదాటి పోవటంతో.. రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసింది జూబ్లీహిల్స్ లోని జాగృతి కన్సల్టెన్సీ. మొత్తం 12 వందల మంది నుంచి 24 కోట్ల రూపాయలను జాగృతి కన్సల్టెన్సీ డైరెక్టర్ జగదీశ్ వసూలు చేసినట్లు చెబుతున్నారు బాధిత నిరుద్యోగులు. ఇప్పుడు ఆఫీసుకు తాళాలు వేసి వెళ్లిపోయారని.. కంపెనీ మోసం చేసిందంటూ పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు.