
మంచిర్యాల, వెలుగు: గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. మాయమాటలతో పలువురు నిరుద్యోగులను నమ్మించి రూ. కోట్లను వసూలు చేసింది. తెలివిగా వారి వద్ద అప్పు తీసుకున్నట్టు కాగితాలు కూడా రాసిచ్చింది. ఇప్పుడు వారందరికీ ఐపీ నోటీసులు పంపి షాక్ ఇచ్చింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ సోమవారం పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని మంచిర్యాల డీసీపీ రక్షిత కె.మూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ మోసంపై సమగ్రంగా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డీసీపీ.. సీఐని ఆదేశించారు.
జరిగింది ఇలా..
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఠాకూర్ సుమలత.. తాను తాండూర్ కేజీబీవీలో ఏఎస్వోగా పని చేస్తున్నానని అందరిని నమ్మించింది. బెల్లంపల్లితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను టార్గెట్చేసుకొని.. గురుకుల స్కూళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడింది. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసింది. ఇలా జిల్లావ్యాప్తంగా 150 మందికిపైగా సుమలతకు సొమ్మును సమర్పించుకున్నారు. ఈ మొత్తం రూ.5కోట్లకు పైగా ఉంటుందని అంచనా.. ఒకవేళ ఉద్యోగం ఇప్పించకపోతే ఎవరి డబ్బులు వాళ్లకు తిరిగి ఇస్తానని కూడా చెప్పింది. ఇందుకు నిరుద్యోగులను నమ్మించేందుకు వారి దగ్గర అప్పు తీసుకున్నట్టు ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు కూడా రాసిచ్చింది.
పలువురికి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చింది. అయితే ఏండ్లు గడుస్తున్నా ఉద్యోగాల ఊసు లేకపోవడంతో పలువురు బాధితులు ఆమె ఇంటిచుట్టూ తిరగడం మొదలు పెట్టారు. ఉద్యోగం ఇప్పించాలని, లేదంటే పైసలు వావస్ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో నెలరోజులుగా ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కొందరికి కోర్టు ద్వారా ఐపీ (ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్) నోటీసులు పంపించింది. అప్పు తీసుకున్నానే తప్పా.. ఉద్యోగాల కోసం డబ్బలు తీసుకోలేదని ఆధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. పలువురికి ఐపీ నోటీసులు రావడం, నెల రోజులుగా సుమలత కనిపించకపోవడం.. సెల్ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో నిరుద్యోగులు కంగుతిన్నారు. చేసేదేమీ లేక తమకు న్యాయం చేయాలని సుమలతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు.