30 ఏండ్ల కింద తప్పిపోయిన కొడుకునంటూ ఇంట్లో చేరిన దొంగ

30 ఏండ్ల కింద తప్పిపోయిన  కొడుకునంటూ ఇంట్లో చేరిన దొంగ
  • ఎంక్వైరీలో వాస్తవం తెలిసి అరెస్టు చేసిన పోలీసులు
  • ఇప్పటికే 9 ఇండ్లను దోచుకున్నట్టు వెల్లడి
  •  యూపీ ఘజియాబాద్​లో ఘటన

లక్నో: చిన్నతనంలో తప్పిపోయిన మీ కొడుకును అంటూ ఇండ్లలో చేరి దోపిడీలకు పాల్పడుతున్న దొంగను యూపీ పోలీసుల అరెస్టు చేశారు. 30 ఏండ్ల కింద తప్పిపోయిన కొడుకుగా పోలీసుల సాయంతోనే ఓ ఇంట్లో చేరాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని కుంటుంబ సభ్యులు చెప్పడంతో ఎంక్వైరీ చేసిన పోలీసులు చరిత్ర అంత తవ్వితీసి అరెస్టు చేశారు. ఇంద్రరాజ్ అలియాస్ రాజు అలియాస్ భీమ్ ​అనే వ్యక్తి గత నవంబర్ నెలలో యూపీలోని ఘజియాబాద్ జిల్లా కోబా పోలీస్​స్టేషన్​కు వెళ్లి 1993లో ఎనిమిది ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు తనను కిడ్నాప్ చేశారని పేర్కొన్నాడు.

 రాజస్థాన్ లోని జైసల్మేర్​కు తీసుకెళ్లి గ్రొర్రెలు, పశువుల కాపరిగా పెంచారని, కొన్నేండ్ల తర్వాత ఢిల్లీ పారిపోయానని చెప్పారు. ఇదే ప్రాంతానికి చెందిన వాడినని తనను కుంటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని కోరారు. దీంతో పోలీసులు అతని స్టోరీని మీడియాకు చెప్పారు.  కథనాలు చూసి వారం  తర్వాత ఘజియాబాద్​కు చెందిన ఓ  ఫ్యామిలీ తమ కొడుకుగా భావించి పోలీసులను కలిశారు. అతను వారితో పాటు ఇంటికి వెళ్లాడు. దీనిపై మీడియా, సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్​ స్టోరీలు వచ్చాయి. 

అయితే అతను తరచూ ఆస్తులు, నగల గురించి అడుగుతుండడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అతనిపై ఎంక్వైరీ మొదలుపెట్టారు. దర్యాప్తులో ఇంద్రరాజ్ రాజస్థాన్‌‌కు చెందినవాడని తేలింది. అతను తరచు దొంగతనాలు చేస్తుండడంతో కుటుంబ సభ్యులు 2005లో ఇంట్లోంచి వెళ్లగొట్టారు. అప్పటి నుంచి  మీ కుటుంబ సభ్యుడిని అంటూ ఇండ్లలో చేరి, ఆపై ఆ ఇంటిని దోచుకొని పారిపోయేవాడు.  

ఇప్పటి వరకు  9 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు. ఈ వార్త తెలుసుకున్న డెహ్రాడూన్​కు చెందిన ఓ ఫ్యామిలీ ఘజియాబాద్ వచ్చి ఫిర్యాదు చేసింది. తమ ఇంట్లో కూడా  4 నెలులు ఉండి దోపిడీకి పాల్పడ్డాడని  పేర్కొన్నారు. అతనికి డీఎన్ఏ టెస్టు చేసి ప్రస్తుతం ఉంటున్న వారి కుటుంబ సభ్యుడా కాదా తేలుస్తామని పోలీసులు చెప్పారు.  2021లో ఓ దొంగతనం కేసులో అతను అరెస్టై జైలు శిక్షకూడా అనుభించినట్లు చెప్పారు.