- ఫేక్ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నుంచి 6 లక్షలు కొట్టేసేందుకు ప్లాన్
- రూ.6,08,889 ఫేక్ మెడికల్ బిల్లులు స్వాధీనం
- వెరిఫికేషన్‌లో గుర్తించిన సెక్షన్ స్టాఫ్
- నలుగురు వ్యక్తులపై, రెండు ప్రైవేట్ హాస్పిటళ్లపై కేసు
హైదరాబాద్/మిర్యాలగూడ, వెలుగు : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్)లో నకిలీ మెడికల్ బిల్లుల గుట్టు రట్టయింది. రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకోకున్నా.. వైద్యం చేయించుకున్నట్లు ఫేక్ మెడికల్ బిల్లులు పెట్టి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 6 లక్షలు కొట్టేసేందుకు ప్లాన్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిల్లులను శాంక్షన్ చేయడానికి ముందు వెరిఫికేషన్ లో నకిలీ బిల్లులను గుర్తించిన సీఎంఆర్ఎఫ్ సెక్షన్ ఆఫీసర్ డీఎస్‌ఎన్ మూర్తి ఫిర్యాదుతో నలుగురు నిందితులు, రెండు ప్రైవేట్ హాస్పిటల్స్‌పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)కు ట్రాన్స్‌ఫర్ చేశారు. సీసీఎస్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
వెరిఫికేషన్‌లో బయటపడ్డ మోసం
సెక్రటేరియట్‌లోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్(ఎఫ్‌ఏసీ)లో సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన బిల్స్‌ను సెక్షన్ స్టాఫ్ పరిశీలించి శాంక్షన్ చేస్తుంటారు. అర్హులైన వారి అకౌంట్స్‌లో డబ్బును డిపాజిట్ చేస్తుంటారు. ఇలా గత నెలలో వెరిఫికేషన్ చేయగా ఖమ్మం, మిర్యాలగూడలోని రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చిన నాలుగు బిల్లులు నకిలీవని గుర్తించారు. దీంతో సెక్షన్ ఆఫీసర్ డీఎస్‌ఎన్ మూర్తి గత నెల21న సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. 31న సీసీఎస్ కు కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు. దీంతో సైఫాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేశారు.
నలుగురి పేరుతో 6 లక్షల ఫేక్ బిల్స్
ఫేక్ బిల్స్ ఆధారంగా వాటిని క్రియేట్ చేసిన ఖమ్మం, మిర్యాలగూడలోని హాస్పిటల్స్ లో హెల్త్ ఆఫీసర్లు తనిఖీలు చేశారు. మిర్యాలగూడలోని మహేశ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ముగ్గురికి నకిలీ బిల్స్ జనరేట్ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో కేస రవి ఆధ్వర్యంలోని బృందం గుర్తించింది. వీటిలో నల్లగొండ జిల్లా జాన్‌పహాడ్‌కు చెందిన బి. జ్యోతి పేరుతో రూ.1,52,196, చెరువుతండాకు చెందిన బి.లక్ష్మి పేరుతో రూ.1,50,567, మిర్యాలగూడ మంగళ్ దుబ్బ తండాకు చెందిన ధీరావత్ నాగర్ పేరుతో రూ. 1,50,272 చొప్పున క్రియేట్ చేసిన బిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురితో పాటు ఖమ్మంలోని వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చాలకుర్తి గ్రామం పూల్యతాండకు చెందిన రమావత్ శివ పేరుతో కూడా రూ.1,55,854 విలువ చేసే నకిలీ మెడికల్ బిల్స్ ఇష్యూ చేసినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
హాస్పిటల్ స్టాఫ్, లీడర్లు కలిసి ప్లాన్
ప్రైవేట్ హాస్పిటల్స్, స్థానిక లీడర్లు కలిసి సీఎంఆర్‌ఎఫ్ నిధులు కొట్టేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నలుగురికి వైద్యం చేయకున్నా.. చేసినట్లు హాస్పిటల్ స్టాఫ్ ద్వారా ఫేక్ బిల్స్ జనరేట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రభుత్వం నుంచి రిలీఫ్ ఫండ్ డిపాజిట్ అయిన తర్వాత హాస్పిటల్ స్టాఫ్, లోకల్ లీడర్లు కలిసి వాటాలు పంచుకునేలా ప్లాన్ వేసినట్లు వెల్లడైంది. దీంతో ఫేక్ బిల్స్ ఇష్యూ చేసిన రెండు హాస్పిటల్స్‌తో పాటు ఫేక్ మెడికల్ బిల్లులు సబ్‌మిట్ చేసిన జ్యోతి, లక్ష్మి, ధీరావత్ నాగర్, రమావత్ శివపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.