అంగట్లో మీ సేవా సర్టిఫికెట్లు

గుడిహత్నూర్,వెలుగు : మీసేవా సెంటర్లలో రావాల్సిన క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ ప్రైవేట్‌ సీఎస్సీ సెంటర్‌లో జారీ చేసిన సంఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శాంతాపూర్‌ గ్రామానికి చెందిన సాబ్లే గోపాల్‌ తన పెళ్లి కావడంతో కల్యాణలక్ష్మి కోసం మండలకేంద్రంలోని ఒక ప్రైవేట్‌ సీఎస్సీ సెంటర్‌లో క్యాస్ట్‌ సర్టిఫికెట్‌కు అప్లై చేసుకున్నాడు. సదరు సెంటర్‌ నిర్వాహకుడు ఒరిజినల్‌ మీసేవా స్టేషనరీ పేపర్‌ పైన తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్టిఫికెట్‌ ను గోపాల్‌ కు ఇచ్చాడు. అయితే సర్టిఫికెట్‌పై డేట్‌ తప్పుగా ప్రింట్‌ కావడంతో గోపాల్‌ మళ్లీ తహసీల్దార్‌ ఆఫీస్‌కు వెళ్లి కరెక్షన్‌ చేయాలని అడిగాడు.

ఆఫీస్‌ సిబ్బంది ఆన్‌లైన్‌లో చెక్‌ చేయగా సదరు సర్టిఫికెట్‌ ఇంకా డీటీ లాగిన్‌లో పెండింగ్‌లో ఉందని తెలిపారు. సర్టిఫికెట్‌ ఎక్కడినుంచి తీసుకున్నావని గోపాల్‌ను విచారించి సీఎస్సీ సెంటర్‌ నిర్వాహకుడిని పిలిపించారు. మీసేవా నుంచి ఖాళీ సర్టిఫికెట్‌ దొంగలించి తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్టిఫికెట్‌ తానే ప్రింట్‌ చేసి ఇచ్చానని ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై తహసీల్దార్‌ సంధ్యారాణిని సంప్రదించగా విచారణ చేపడుతున్నామని, పూర్తి నివేదికను అధికారులకు అందజేస్తామని తెలిపారు.