
- ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్స్‌ను కంట్రోల్ చేయాలి
- దేశమంతా ఒక యూనిట్‌గా పనిచేయాలి: సీఎం రేవంత్
- సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం
- సైబర్ సెక్యూరిటీలో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్
- సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా
- 7 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసినం
- సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం
- ఎకో సిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన
- షీల్డ్-–2025 సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్,వెలుగు: ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ సమాజంలో అలజడి సృష్టిస్తున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జరగని నేరాలు జరిగినట్టు.. జరగని దాడులు జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వీటిని కంట్రోల్ చేసేందుకు పకడ్బందీ చర్యలు అవసరమని పేర్కొన్నారు. సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని, వీటిని పూర్తిస్థాయిలో నియంత్రించాలని అన్నారు. లేదంటే దేశంలోని పౌరులకు, ఆర్థిక వ్యవస్థకు ఎనలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రజల జీవన స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి పరిణామాలను అరికట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని సైబరాబాద్ హెచ్‌ఐసీసీలో షీల్డ్–-2025 పేరుతో “బాధితులకు రక్షణ కవచంగా సైబర్ భద్రత- –డిజిటల్ భవిష్యత్తు” అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సును.. ఐటీ మినిస్టర్ శ్రీధర్‌బాబు, డీజీపీ జితేందర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ ఫ్యూజన్ సెంటర్ (సీఎఫ్‌సీ), సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్‌ఓసీ), చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్(సీపీయూ) ను వర్చువల్‌గా స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్,14 రాష్ట్రాలకు చెందిన సైబర్ నిపుణులు, వివిధ రంగాలకు చెందిన సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు ఇంట్లో దొంగలు చొరబడి దాచుకున్న సొమ్మును దొంగిలించేవారు. కానీ ఇప్పుడు ఎక్కడో ఉండి డబ్బులు కొట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి..ఎవరు చేశారో గుర్తించడం కూడా పెద్ద సవాల్‌గా మారింది.
ఆకాశమే హద్దుగా చెలరేగుతూ రోజుకో కొత్త రూపంతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల నియంత్రణకు ఐటీ సంస్థలు, నిపుణులతో కలిసి నిబద్ధతతో పనిచేస్తున్నాం’’ అని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామని, సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని చెప్పారు. నిరుడు సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
సైబర్ డిఫెన్స్ సెంటర్ పెడ్తం: శ్రీధర్‌బాబు
ప్రపంచమంతా దేశంతోపాటు హైదరాబాద్ వైపు చూస్తున్నదని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో అధునాతన టెక్నాలజీతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనిచేస్తున్నదని తెలిపారు. సైబర్ దాడుల నుంచి ప్రభుత్వ సంస్థలను రక్షించడానికి త్వరలో ‘తెలంగాణ సైబర్ డిఫెన్స్ సెంటర్’ (టీజీసీడీసీ) స్థాపించబోతున్నామని, ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ప్రకటించారు. టెక్నాలజీ వల్ల ఎంత ప్రయోజనం ఉందో అదేస్థాయిలో విధ్వంసం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ క్రిమినల్స్ అధునాతన టెక్నాలజీతో దాడులు చేస్తున్నారని తెలిపారు. అన్ని రంగాలపై సైబర్ క్రిమినల్స్ ప్రభావం ఉందని చెప్పారు. రాష్ట్రంలో రోబస్ట్ సైబర్ సెక్యూరిటీ ఎకో సిస్టమ్ వినియోగిస్తున్నామని తెలిపారు. ఏఐ కీలకంగా మారిందని, ట్రెడిషనల్ సైబర్ సెక్యూరిటీ పెరిగిపోతున్నదని అన్నారు. నేరాల కంట్రోల్‌కు అన్ని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, ఐటీ కంపెనీలు కలిసి పనిచేయాలని సూచించారు.
రాష్ట్రంలోనే ఎక్కువ సైబర్ సేఫ్టీ: డీజీపీ జితేందర్
నిరుడు రాష్ట్రంలో జరిగిన సైబర్ నేరాల్లో రూ.350 కోట్లు హోల్డ్ చేసినట్టు డీజీపీ జితేందర్ తెలిపారు. 18 వేల మంది బాధితులకు రూ.183 కోట్లను తిరిగి అందించామని వెల్లడించారు. సైబర్ నేరాలను గుర్తిస్తూ.. అతి వేగంగా స్పందిస్తున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బందిని ఆయన అభినందించారు. దర్యాప్తులో ఏఐ -ఆధారిత టెక్నాలజీని వినియోగించడాన్ని కొనియాడారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ భద్రత కీలకమైన అంశమని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా అన్నారు. ఆర్థిక వ్యవస్థలు, మౌలిక సదుపాయాలపై సైబర్ నేరాల ప్రభావం తీవ్రంగా ఉంటున్నదని తెలిపారు. పటిష్టమైన సైబర్ సేఫ్టీ విధానాల కోసం వేగవంతమైన చర్యలు తప్పనిసరి అని చెప్పారు. సైబర్ చట్టాలను బలోపేతం చేయడంలో రాష్ట్రం నిబద్ధతతో ఉందన్నారు.
నైపుణ్యాభివృద్ధి కోసమే: శిఖాగోయల్
సైబర్ సెక్యూరిటీ పరిశోధన, విధాన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి కోసం షీల్డ్ –2025 నిర్వహిస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఐఐటీ, నల్సార్, ఐఎస్‌బీలతో ఎంఓయూలు చేసుకున్నట్టు వెల్లడించారు. రాబోయే రోజుల్లో గూగుల్ సహకారంతో ఏఐ ఆధారిత రియల్- టైమ్ నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2 రోజులపాటు జరగనున్నఈ సదస్సుకు 900 మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా14 రాష్ట్రాలకు చెందిన లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సీనియర్ అధికారులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఐటీ, టెలికాం, డిఫెన్స్, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ల నుంచి విద్యార్ధులు హాజరైనట్టు తెలిపారు.
సైబర్ క్రైమ్స్‌ను పూర్తిగా నియంత్రించాలి
నిరుడు దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రూ. 22,812 కోట్లు దోచుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకో సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తునట్టు ప్రకటించారు. ‘‘సైబర్ నిపుణులు, ఐటీ సంస్థలతో కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వం అన్ని రకాల వనరులు సమకూరుస్తున్నది. సైబర్ నేరాలను గుర్తించడం..క్రిమినల్స్‌ను పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు ముందంజలో ఉన్నారు. కానీ ఇది సరిపోదు. సైబర్ నేరాలను పూర్తిగా నియంత్రించాలి. ఇదే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని వెల్లడించారు. సైబర్ నేరాలతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. ‘‘ప్రతి క్షణం ఏదో ఒక సైబర్ నేరం జరుగుతున్నది. నేరం ఎక్కడి నుంచి జరిగింది? నేరం చేసింది ఎవరు? అనేది గుర్తించడం.. వారిని పట్టుకుని శిక్షించడంతోపాటు అసలు సైబర్ నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంది” అని అన్నారు. 24/7 అందుబాటులో ఉండే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్1930 ను అందరికీ షేర్ చేయాలని సూచించారు. సైబర్క్రైమ్అదుపునకు దేశమంతా యూనిట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
ఒకప్పుడు ఇంట్లో దొంగలు చొరబడి దాచుకున్న సొమ్మును దొంగిలించేవారు. కానీ ఇప్పుడు ఎక్కడో ఉండి డబ్బులు కొట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి..ఎవరు చేశారో గుర్తించడం కూడా పెద్ద సవాల్‌గా మారింది. అడ్డూఅదుపు లేకుండా చెలరేగుతూ రోజుకో తీరుగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల నియంత్రణకు ఐటీ సంస్థలు, నిపుణులతో కలిసి నిబద్ధతతో పనిచేస్తున్నాం.
– సీఎం రేవంత్ రెడ్డి