హనుమకొండలో ఫేక్ ఎన్ఐఏ ఆఫీసర్ పట్టివేత

హనుమకొండలో ఫేక్ ఎన్ఐఏ ఆఫీసర్ పట్టివేత

హనుమకొండ, వెలుగు: పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్న  ఫేక్​ఎన్ఐఏ ఆఫీసర్​తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​చేశారు. వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా అడిశర్లపల్లి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన నార్ల నరేశ్ ఇంటర్ వరకు చదివాడు. ప్రస్తుతం డిస్టెన్స్​లో డిగ్రీ చేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం మోసాలకు తెరలేపాడు. ఆర్మీ యూనిఫాం, ఎయిర్​ పిస్టల్ కొన్నాడు. ఆర్మీ ఉద్యోగిగా ప్రచారం చేసుకుంటూ గ్రామంలోని యువకులకు నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఐదుగురి నుంచి రూ.5 లక్షల చొప్పున వసూలు చేశాడు. వారిని ట్రైనింగ్ పేరున మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని వైష్ణవి కెరీర్ ఫౌండేషన్​ అనే ఇనిస్టిట్యూట్ లో చేర్పించాడు. ఇటీవల తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు నరేశ్ తల్లిదండ్రులను నిలదీశారు. గత్యంతరం లేక వారు బాధితులకు డబ్బు కట్టారు. 

పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయంటూ..

ఇటీవల దేశంలో పీఎఫ్ఐ సంస్థతో సంబంధాలపై ఎన్ఐఏ దర్యాప్తుల విషయం తెలుసుకున్న నరేశ్ భారీ దోపిడీకి స్కెచ్ వేశాడు. ఎన్ఐఏ అధికారినంటూ గ్రామానికి చెందిన నేలపట్ల రాజేశ్, వినయ్ బాబును నమ్మించాడు. ఎన్ఐఏలోనే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. అనంతరం వారితో కలిసి పీఎఫ్ఐ సంస్థతో సంబంధాలు ఉన్నాయంటూ కాకతీయ యూనివర్సిటీ పీఎస్​పరిధిలోని ఇద్దరిని బెదిరించాడు. ఎయిర్ పిస్టల్​ను గురిపెట్టి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్​ చేశాడు. అడిగినంత ఇవ్వకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని భయపెట్టడంతో బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం కేయూ ఫస్ట్ గేట్ వద్ద నరేశ్​ను పోలీసులు పట్టుకున్నారు. ఆర్మీ యూనిఫాం, ఎయిర్​ పిస్టల్, ల్యాప్​టాప్​, రెండు బైకులు, సెల్​ఫోన్​స్వాధీనం చేసుకున్నారు. నరేశ్​గతంలో జగిత్యాల జిల్లాలో ఇదే తరహాలో నేర్పాలకు పాల్పడినట్లు సీపీ వివరించారు.