ఎంతకు బరి తెగించార్రా.. హైకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు

ఎంతకు బరి తెగించార్రా.. హైకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు
  • శంషాబాద్ పైగా భూముల వ్యవహారంలో వెలుగులోకి.. 
  • హైకోర్టు సీరియస్.. సిట్ దర్యాప్తుకు ఆదేశం  
  • భూములపై యథాతథ స్థితి కొనసాగిస్తూ ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: శంషాబాద్‌‌‌‌లోని వివాదాస్పద పైగా భూములపై హక్కుల కోసం హైకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు సృష్టించిన వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టకముందే ఆయన పేరుతో నకిలీ ఉత్తర్వులు తయారు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇది న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది. ఈ వ్యవహారంపై నివేదిక తెప్పించుకున్న హైకోర్టు.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని జ్యుడీషియల్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌ను ఆదేశించింది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌‌‌‌ (సిట్‌‌‌‌)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

అసలేం జరిగిందంటే? 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌‌‌లోని సర్వే నంబర్ 611 నుంచి 664, 720,721, 724 నుంచి 732, 775లో సుమారు 100 ఎకరాల వరకు ఉన్న పైగా భూములకు సంబంధించిన హక్కులపై మహమ్మద్‌‌‌‌ తాహెర్‌‌‌‌ ఖాన్‌‌‌‌కు అనుకూలంగా సివిల్‌‌‌‌ కోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. అయితే దానిపై హెచ్‌‌‌‌ఎండీఏ అప్పీల్‌‌‌‌ చేసింది.

 ఈ అప్పీల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌‌‌‌ టి.వినోద్‌‌‌‌ కుమార్, జస్టిస్‌‌‌‌ పి.శ్రీసుధతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా హైకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు ఇచ్చినట్టు గుర్తించింది. హైకోర్టులో పెండింగ్‌‌‌‌లో ఉన్న సీఎస్‌‌‌‌ 7/1958 దరఖాస్తుకు సంబంధించి 1988 డిసెంబర్ 28న న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌‌‌‌ ఎస్‌‌‌‌డీ పట్నాయక్‌‌‌‌ 1988 ఏప్రిల్‌‌‌‌ 29నే ఉత్తర్వులు జారి చేసినట్టు నకిలీ ఉత్తర్వులు తయారు చేశారు. 

అంతేగాకుండా ఈ భూములకు సంబంధించి కొంతమందికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయంటూ పేర్కొనే పిటిషన్‌‌‌‌ నంబర్‌‌‌‌ పేరుతో హైకోర్టులో ఎలాంటి రికార్డులు లేవు. దీనిపై సందేహాలు తలెత్తడంతో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్‌‌‌‌ రిజిస్ట్రీని బెంచ్ ఆదేశించింది. 

గతంలోనూ రెండుసార్లు.. 

అసలు పిటిషన్ లేకుండానే హైకోర్టు న్యాయమూర్తి పేరుతో నకిలీ ఉత్తర్వులు జారీ అయినట్టు రిజిస్ట్రీ విచారణలో తేలింది. ఈ మేరకు డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌కు రిజిస్ట్రీ నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో నకిలీ ఉత్తర్వుల వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకుగాను పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని జ్యుడీషియల్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌ను హైకోర్టు తాజాగా ఆదేశించింది.  సత్వర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. 

అంతేగాకుండా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అనుమతితో నకిలీ ఉత్తర్వుల వివరాలను జిల్లా జ్యుడీషియల్‌‌‌‌ అధికారులకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. నకిలీ ఉత్తర్వుల ఆధారంగా ఎలాంటి ఆదేశాలు వెలువరించకుండా సర్క్యులర్‌‌‌‌ జారీ చేయాలని చెప్పింది. ఈ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను హైకోర్టు వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో కూడా పొందుపర్చాలని సూచించింది. అప్పటివరకు శంషాబాద్‌‌‌‌లోని పైగా భూములపై యధాతథస్థితి కొనసాగించాలని, ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. పోలీసుల దర్యాప్తు ఆధారంగా పిటిషనర్లు హైకోర్టుకు రావచ్చునని చెప్పింది.