రైతు బంధుకో.. ఫేక్ పాస్ బుక్

రైతు బంధుకో.. ఫేక్ పాస్ బుక్
  • మానుకోట జిల్లా గూడూరు మండలంలో జోరుగా దందా
  • గతేడాదిగా బీఆర్ఎస్ నేతలు, ఆఫీసర్ల అక్రమాలు 
  • ఒక్కొక్కరి నుంచి రూ. 20వేల దాకా వసూలు 
  • పంచాయతీ కార్యదర్శి భార్యపైనా ఫేక్ పాస్ బుక్ 
  • ఆఫీసర్లు గుర్తించడంతో రద్దు చేయించిన  సెక్రటరీ

గూడూరు, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్  హయాంలో పోడు భూముల  రైతులకు పట్టా పాస్ బుక్ లు ఇచ్చింది. ఇదే అదునుగా రెవెన్యూ ఆఫీసర్లతో పాటు బీఆర్ఎస్ నేతలు నకిలీ పట్టా పాస్ బుక్ ల దందాకు తెరలేపారు. భూమి లేకపోయినా సర్కార్ ఇచ్చే  రైతుబంధు తీసుకోవచ్చని రైతులను నమ్మించి.. ఒక్కొక్కరి వద్ద రూ. 20వేల వరకు వసూలు చేశారు. మరోవైపు రైతుల భూముల ను జాయింట్ సర్వే చేసి పట్టా బుక్ లు ఇవ్వాల్సిన ఆఫీసర్లు బై నంబర్లతో ఫేక్ బుక్ లు సృష్టించి ఇవ్వడం గమనార్హం. ఇలాంటి దందా గతేడాదిగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జోరుగా నడుస్తుంది.

ఇప్పటికే అదే మండలానికి చెందిన 6 వేల  మందికి పైగా పోడు రైతులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 4 వేల మందికి పాస్ బుక్ లు అందించారు. అయితే.. ఇందులో 400కుపై గా ఫేక్ పాస్ బుక్ లు తయారు చేసి ఇచ్చినట్టు అధికారులు లేట్ గా గుర్తించినట్టు సమాచారం. గతేడాది పంట కాలంలో  అర్హులైన రైతులతో పాటు ఫేక్ పాస్ బుక్ లు పొందిన 175 మందికి కూడా రైతుబంధు వేసేందుకు ఆన్ లైన్  చేశారు. విషయం తెలియ డంతో జిల్లా ఆఫీసర్లు వెంటనే 175 మందికి  రైతుబంధు నిలిపేశారు. దీంతో దళారులు సైలెంట్ గా ఉండిపోయారు.

ఇక  సర్కార్ తో పాటు అధికారులు కూడా మారడంతో మిగిలిన 200కు పైగా రైతులకు పాస్ బుక్ లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కొద్ది రోజులుగా సుమారు 50 మందికి పాస్ బుక్ లను అందిస్తున్నట్టు తెలిసింది. ఇదంతా అధికారుల అండదండలతోనే  చేస్తున్నట్టు సమాచారం. పాస్ బుక్ లు  తీసుకున్న రైతులు తమకు రైతుబంధు పడుతుందనే ఆశతో డబ్బులు చెల్లించినట్టు చెబుతున్నారు. ఇలా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేందుకు అక్రమాలకు పాల్పడుతున్న దళారులకు, అధికారులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే రాబోయే రోజుల్లో  రైతుబంధు కోసం మరిన్ని  ఫేక్ పాస్ బుక్ లను తయారు చేసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

 పంచాయతీ  కార్యదర్శి  భార్య పేరుతో..

గూడూరు మండలంలోని ఒక పంచాయతీ కార్యదర్శి తన భార్య పేరుతోనూ నకిలీ పాస్ బుక్ సృష్టించాడు. ఇది కాస్త ఆఫీసర్లకు తెలియడంతో వెంటనే రద్దు చేశారు. అంతేకాకుండా తన ఆఫీసులోని సిబ్బందికి కూడా పాస్ బుక్ లు తయారు చేయించినట్లు సమాచారం. పోడు పట్టాల మంజూరుకు జాయింట్ సర్వేలో పాల్గొన్న ఆఫీసర్లు అవినీతికి పాల్పడి ఫేక్ బుక్ లకు సహకరించారనే  ఆరోపణలు ఉన్నాయి. 

గూడూరు   డిప్యూటీ తహసీల్దార్   కోమలను సంప్రదించగా.. తనకు కొద్దిరోజుల కిందనే తెలిసిందని చెప్పారు.  పంచాయతీ కార్యదర్శి భార్యపైన కూడా ఫేక్ పాస్ బుక్ పొందిన విషయం జిల్లా ఆఫీసర్లకు తెలియడంతో తనే రద్దు చేయించుకున్నట్టు తెలిసిందని ఆమె పేర్కొన్నారు.