![ఫేక్ పాస్‌పోర్టు తయారీ ముఠా అరెస్ట్](https://static.v6velugu.com/uploads/2024/01/fake-passport-making-gang-arrested-at-hyderabad_aj61dRGf4z.jpg)
- రెండేండ్లుగా చేస్తున్న దందాను రట్టు చేసిన పోలీసులు
- ఇప్పటికే 92 మంది విదేశాలకు వెళ్లినట్లు గుర్తింపు
- 108 పాస్‌పోర్టులు సీజ్
హైదరాబాద్, వెలుగు: నకిలీ సర్టిఫికెట్లతో విదేశీయులకు ఇండియన్ పాస్‌పోర్ట్స్‌తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఫేక్ ఆధార్, బర్త్, స్టడీ సర్టిఫికెట్స్,ఫేక్ రెసిడెన్సియల్ ప్రూఫ్స్‌తో పాస్‌పోర్టులు తయారు చేస్తున్న12 మంది సభ్యుల ముఠాను రాష్ట్ర సీఐడీ ఆఫీసర్స్ శుక్రవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, కోరుట్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ సత్తార్, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులను,10 మంది ఏజెంట్స్ ను రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి108 పాస్‌పోర్టులు, 5 ల్యాప్ టాప్స్, 3 ప్రింటర్స్,11 పెన్ డ్రైవ్స్, స్కానర్,15
సెల్‌ఫోన్స్, పాస్‌పోర్ట్ అప్లికేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సీఐడీ చీఫ్, అడిషనల్ డీజీ శిఖాగోయల్ శనివారం వెల్లడించారు.
పాతబస్తీ వ్యక్తే కీలకం..
పాతబస్తీకి చెందిన అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జహ్‌వరి(50) గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ పనులు చేసేవాడు. ఈజీమనీ కోసం 2011 నుంచి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీకి చెందిన ఫేక్ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికెట్స్‌ను తయారు చేయడం ప్రారంభించాడు. శ్రీలంక, ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు పాస్‌పోర్ట్ అందించే చెన్నైకి చెందిన ఓ ఏజెంట్.. అబ్దుల్ సత్తార్‌కు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి దేశంలో అక్రమంగా షెల్టర్ పొందుతున్న శ్రీలంక సహా ఇతర దేశాలకు చెందిన వారికి ఇండియన్ పాస్‌పోర్ట్‌లు తయారు చేసి ఇస్తున్నారు.
రెండేండ్లుగా కొనసాగుతున్న దందా..
పాస్‌పోర్ట్ కోసం అవసరమైన నకిలీ డాక్యుమెంట్ల తయారీకి అబ్దుల్ సత్తార్.. ట్రావెల్ ఏజెంట్లతో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. స్థానిక స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు డబ్బులిచ్చి అడ్రెస్ వెరిఫికేషన్ పూర్తి చేయించేవారు. రద్దీ తక్కువగా ఉండే ఆదిలాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో అభ్యర్థుల పేర్లపై స్లాట్స్ బుక్ చేసేవారు. గత రెండేండ్లుగా ఫేక్ దందా నడుపుతున్నారు.
ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో..
ఫేక్ అడ్రస్‌తో పాస్‌పోర్ట్ పొందిన వారిలో 92 మంది ఇప్పటికే అబ్రాడ్‌కు వెళ్లారు. ఫేక్ పాస్‌పోర్టులపై ఇమ్మిగ్రేషన్ అధికారులు అందించిన సమాచారంతో సీఐడీ ఆఫీసర్స్ అప్రమత్తమయ్యారు.ఈ నెల18న సుమోటొ కేసు నమోదు చేశారు. ఎస్‌పీ వెంకట లక్ష్మీ ఆధ్వర్యంలో శుక్రవారం ఐదు జిల్లాల్లో సెర్చ్ ఆపరేషన్ చేశారు. చెన్నై ఏజెంట్‌ను బెంగళూరులో అరెస్ట్ చేశారు.