కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శుక్రవారం ముగ్గురు పాస్ పోర్ట్ ఏజెంట్ల ఇండ్లలో సీఐడీ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్నారని హైదరాబాద్ సీఐడీ ఆఫీసులో కేసు నమోదు కావడంతో రాంనగర్‌లోని అశోక్, సంగెం రోడ్డులో ఉండే కమురొద్దీన్, ఐబీ రోడ్డులోని చాంద్ ఖాన్ ఇండ్లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నలు గురు సీఐడీ డీఎస్పీల పర్యవేక్షణలో మూడు టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి.
శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈ సోదాలు మొదలయ్యాయి. తర్వాత ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నకిలీ పాస్ పోర్టులు, అవి తయారు చేయడానికి ఉపయోగించే మెటీరియల్ , నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. సీఐడీ అధికారులు మాత్రం వివరాలు వెల్లడించలేదు. సీఐడీ డీఎస్పీలు నందిరామ్, సంపత్ , రవీందర్, వెంకటేశ్10 మంది సీఐలు, ఎస్సై లు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంగా దందా..
కొంత కాలంగా జగిత్యాల జిల్లా కేంద్రంగా నకిలీ పాస్‌పోర్టులు తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంది. శుక్రవారం ముగ్గురి ఏజెంట్ల ఇండ్లలో తనిఖీలు నిర్వహించగా ఒక ఏజెంట్గతంలో దొంగ పాస్‌పోర్టుల వ్యవహారంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడని తేలింది. నకిలీ పాసుపోర్టులతో కొందరిని విదేశాలకు కూడా పంపినట్టు సమాచారం. దీంతో ఈ కేసులో ఎవరెవరు ఉన్నారని సీఐడీ ఆరా తీస్తునట్టు తెలిసింది.