
- గిరిజనులకు పట్టాదార్ పాస్‌బుక్స్ ఇస్తామన్న ప్రభుత్వం
- దీన్ని ఆసరా చేసుకొని అక్రమ దందాకు తెరలేపిన ముఠా
- రూ.3.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకే ఎకరం అంటూ బురిడీ
- అటవీ భూముల సర్వే నంబర్లతో నకిలీ పాస్ పుస్తకాల తయారీ
- సుమారు 100 మంది మోసపోయారని అంచనా
నల్గొండ, వెలుగు : అమాయక గిరిజనులకు అటవీ భూములు చూపి, వాటికి పట్టాలిప్పిస్తామని నమ్మించి లక్షల్లో కొల్లగొట్టారు. నకిలీ పాస్‌బుక్‌లు చేతిలో పెడుతూ వందల మంది నుంచి కోట్లు దండుకొని ఉడాయించారు. ఈ కొత్త తరహా మోసం నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది. గిరిజనులకు పట్టాదార్ పాస్‌బుక్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.
గిరిజనులను టార్గెట్ చేసి అటవీ భూములు ఇప్పిస్తామంటూ నమ్మించి ఒక్కో ఎకరానికి రూ. రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసి, నకిలీ పాస్ పుస్తకాలు ఇచ్చారు. మిర్యాలగూడకు చెందిన ఓ వ్యక్తి పాస్‌బుక్స్‌ను నకిలీగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్రమ వ్యవహారం బయటపడింది.
పైలెట్ ప్రాజెక్ట్‌లో పట్టాలు ఇప్పిస్తామంటూ...
నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్‌లోని దామరచర్ల, అడవిదేవులపల్లి, త్రిపురారం, తిరుమలగిరి (సాగర్), పెద్దవూర మండలాల్లో అటవీ భూములు ఉన్నాయి. ఈ భూములను ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతులు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. దీంతో అటవీ భూముల సర్వేకు నిర్ణయించిన ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్‌గా డివిజన్ పరిధిలోని తిరుమలగిరి(సాగర్)ని ఎంపిక చేసింది.
సర్వే పూర్తికావడంతో, సాగులో ఉన్న అర్హులైన రైతుల జాబితా రూపొందించి, అన్ని గ్రామాల రైతులకు ఒకే సారి సీఎం చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఈ టైంలో రంగంలోకి దిగిన కొందరు వ్యక్తులు ‘మాకు తెలిసిన ఆఫీసర్లు ఉన్నారు, డబ్బులు ఇస్తే భూములకు పట్టాలు ఇప్పిస్తాం, మిర్యాలగూడకు చెందిన ఓ వ్యక్తికి ఇలాగే 10 ఎకరాలు ఇప్పించాం, ఏడాది నుంచి కూరగాయలు సాగు చేసుకుంటున్నాడు’ అని గిరిజనులను నమ్మించారు. ఇది నిజమేనని నమ్మిన గిరిజనులు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.
ఎకరానికి రూ.3.50 లక్షల నుంచి రూ. 5 లక్షలు వసూలు
పైలెట్ ప్రాజెక్ట్ కింద భూములకు పట్టాలు ఇప్పించేందుకు కొంత ఖర్చు అవుతుందని చెప్పిన అక్రమార్కులు గిరిజనుల నుంచి ఒక్కో ఎకరానికి రూ. 3.50 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా సుమారు 100 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చిన వారికి అటవీ భూముల సర్వే నంబర్లతో నకిలీ పాస్‌పుస్తకాలను తయారు చేసి ఇచ్చారు.
సీఎం చేతుల మీదుగా పట్టాలు అందుకున్న తర్వాత భూమిని సాగు చేసుకోవాలని సూచించేవారు. అయితే మహమూద్ అలీ అనే వ్యక్తి తనకు ఇచ్చిన పాస్ పుస్తకం నకిలీదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిర్యాలగూడకు చెందిన నేనావత్ ప్రసాద్ అనే వ్యక్తి తిరుమలగిరి (సాగర్) మండలం నేత్యా తండాలో అటవీ భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తానని రూ. 4 లక్షలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ దందా వెనుక ఎంత మంది ఉన్నారు ? ఎవరెవరికి పట్టాలు ఇచ్చారు ? అనే విషయాలను తెలుసుకుంటున్నారు. పరారీలో ఉన్న ప్రసాద్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తు చేపట్టాం
నకిలీ పాస్‌పుస్తకాలను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాపై కేసు నమోదు చేశాం. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నాం. ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై విచారణ చేస్తున్నాం.– వీరబాబు, సీఐ, మిర్యాలగూడ