పింఛన్ పెట్టిస్తానని.. పుస్తెలతాడు చోరీ

పింఛన్ పెట్టిస్తానని.. పుస్తెలతాడు చోరీ
  • దొంగను అరెస్ట్ చేసిన కరీంనగర్ జిల్లా పోలీసులు
  • నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా 85 కేసులు నమోదు

జమ్మికుంట, వెలుగు: పింఛన్‌‌ పెట్టిస్తానని వృద్ధ దంపతులకు మాయమాటలు చెప్పి పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన దొంగ కరీంనగర్ జిల్లా పోలీసులకు పట్టుబడ్డాడు. హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ శుక్రవారం జమ్మికుంట పీఎస్‌‌లో మీడియాకు వివరాలు వెల్లడించాడు. ఈనెల15న అల్లెపురెడ్డి కమలమ్మ, కొమురెడ్డి దంపతులు జమ్మికుంట హాస్పిటల్‌‌కు వెళ్లారు. అనంతరం ఇంటికి వెళ్దామని  కొండూరి కాంప్లెక్స్ వద్ద మెట్ల మీద కూర్చోగా.. అక్కడికి అల్లెపు కృష్ణ వెళ్లాడు. మండలంలోని కనపర్తి పంచాయతీ సెక్రటరీనని, రూ.4 వేల పింఛన్ పెట్టిస్తానని, అందుకు ఆధార్​కార్డు జిరాక్స్‌‌లు కావాలని అడిగాడు. 

అతని మాటలు నిజమేనని దంపతులు నమ్మారు. అనంతరం కమలమ్మను ఫొటో తీయాలని, ఒంటి మీద బంగారం ఉండొద్దని చెప్పాడు. ఆమె తన మెడలోని 3.5తులాల పుస్తెల తాడును తీసి పక్కన పెట్టగా.. దాన్ని తీసుకుని నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితుడు కృష్ణను పట్టుకున్నారు. దొంగపై రాష్ట్రవ్యాప్తంగా 85 కేసులు నమోదై ఉన్నట్లు ఏసీపీ చెప్పారు. రెండుసార్లు పీడీ యాక్ట్ కింద నాలుగేండ్ల జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు.