
వరంగల్, వెలుగు: ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందులు, విత్తనాలు అమ్ముతున్న ముఠాలోని ఏడుగురిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన ప్రధాన నిందితుడు ఇరుకుల్ల వేద ప్రకాశ్, మహ్మద్ సిద్దిక్ అలీ, సుల్తానాబాద్‌కు చెందిన నూక రాజేశ్, ఎల్లం సదాశివుడు( కరీంనగర్),ఎండీ రఫీక్(ములుగు), ఆళ్లచెరువు శేఖర్(ప్రకాశం), పొదిళ్ల సాంబయ్య (వరంగల్), విష్ణు వర్దన్(పరారీలో ఉన్నాడు), ముద్దగుల ఆదిత్య(హైదరాబాద్, జైలులో ఉన్నాడు) కలిసి ముఠాగా ఏర్పడి రైతులను మోసం చేశారు.
ప్రధాన నిందితుడు ఇచ్చిన సమాచారంతో శేఖర్, విష్ణువర్దన్ గోదామ్లపై టాస్క్‌ఫోర్స్, మట్టెవాడ పోలీసులు దాడులు చేసి రూ.78.63 లక్షల విలువైన నకిలీ పురుగు మందులు, విత్తనాలు, తయారీ మిషనరీ, ప్రింటింగ్ సామగ్రి, రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.