
- నాలుగున్నరేండ్ల బీపీటీ చదవకుండానే క్లినిక్‌ల ఏర్పాటు
- సర్టిఫికెట్, డిప్లొమా, డిస్టెన్స్కోర్సులతో మరికొందరు
- ఆయుష్, ఆయుర్వేద, నేచురోపతి, ఆక్యుపంక్షర్పేరిట ఫిజియోథెరపీ
- అన్క్వాలిఫైడ్ వ్యక్తులపై కలెక్టర్‌కు కంప్లయింట్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో నకిలీ ఫిజియోథెరపిస్టుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బ్యాచిలర్‌ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ) విద్యార్హతలు లేకుండానే ఫిజియోథెరపిస్టులుగా చెలామణీ అవుతున్నారు. మరికొందరు ఆయుర్వేద, ఆక్యుపంక్చర్, ఆయుష్, పంచకర్మ క్లినిక్‌ల పేరిట ఫిజియోథెరపీ చేస్తూ పేషెంట్లను మోసం చేస్తున్నారు. మంచిర్యాలలోని చాలా హాస్పిటళ్లలో ఇలాంటి వారు ఉన్నారు. మందమర్రి, బెల్లంపల్లి, లక్సెట్టిపేట తదితర ప్రాంతాల్లో అర్హత లేకుండానే ఫజియోథెరపిస్టులుగా కొనసాగుతున్నారు. మెడికల్అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. పలువురిపై ఫిర్యాదులు అందినప్పటికీ అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి.
గల్లీకో ఫిజియోథెరపీ క్లినిక్
మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు వివిధ పట్టణాల్లో గల్లీగల్లీకి ఫిజియోథెరపీ క్లినిక్‌లు వెలుస్తున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్ పెట్టాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగున్నర సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ఫిజియోథెరపీ (బీపీటీ) పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు స్టేట్పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పర్మిషన్తప్పనిసరి. ప్రస్తుతం జిల్లాలో డీఎంహెచ్‌వో ద్వారా పర్మిషన్ పొందిన క్లినిక్‌లు 13 మాత్రమే ఉన్నాయి. అందులో మంచిర్యాలలో 10 ఉండగా, మిగతా మూడు మందమర్రి, బెల్లంపల్లిలో ఉన్నాయి. కాగా మరో 10 వరకు వైద్యారోగ్యశాఖ అనుమతి లేకుండా కొనసాగుతున్నట్లు సమాచారం.
పట్టించుకోని అధికారులు
అర్హత లేనివారు జిల్లాలో ఫిజియోథెరపీ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వివిధ సంస్థల ద్వారా సర్టిఫికెట్, డిప్లొమా, డిస్టెన్స్కోర్సులు చేసినవారు, సీనియర్ల దగ్గర పనిచేస్తూ అనుభవం సంపాదించినవారు ఎలాంటి సర్టిఫికెట్లు, పర్మిషన్లు లేకుండానే ఫిజియోథెరపిస్టులుగా ప్రాక్టీస్చేస్తున్నారు. మరికొందరు పేషెంట్లకు హోమ్సర్వీస్లు అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కొన్ని హాస్పిటళ్లలో రిజిస్ట్రేషన్ఒకరి పేరిట ఉంటే, వారి స్థానంలో అర్హత లేని వేరొకరు పనిచేస్తున్నారు. నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పులు, డిస్క్ పెయిన్, సయాటికా, స్పాండిలైటిస్ వంటి తీవ్రమైన సమస్యలకు తెలిసీ తెలియని ట్రీట్మెంట్ అందిస్తూ పేషెంట్లను మరింత ప్రమాదంలోకి నెడుతున్నారు.
కలెక్టర్‌కు కంప్లయింట్
అన్క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్టులపై ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల కొంతమంది క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్టులు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు కంప్లయింట్ చేశారు. మంచిర్యాల బస్టాండ్ రోడ్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో కృష్ణ అనే వ్యక్తి ఫిజియోథెరపిస్ట్ కాకపోయినా అలా చెలామణీ అవుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంచిర్యాలలోని ఓ న్యూరో సెంటర్లో వేదవతి, సోహెల్ ఫిజియోథెరపీ క్లినిక్ లో పర్వీన్, లక్సెట్టిపేటలోని స్టార్ ఫిజియోథెరపీ క్లినిక్‌లో విజయ్, మందమర్రిలోని ఎస్ఆర్ఎం ఫిజియోథెరపీ క్లినిక్‌లో రమాదేవి అర్హత లేకున్నా కొనసాగుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నేచురోపతి, ఆయుర్వేదిక్, ఆక్యుపంక్చర్, ఆయుష్ క్లినిక్‌ల పేరిట కొన్ని సెంటర్లలో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలిపారు. అన్ క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్టులపై ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
అధికారులు యాక్షన్ తీసుకోవాలి
మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో అన్ క్వాలిఫైడ్ఫిజియోథెరపిస్టులు కొనసాగుతున్నారు. సర్టిఫికెట్, డిప్లొమా, డిస్టెన్స్కోర్సుల పేరిట ఫేక్సర్టిఫికెట్లతో క్లినిక్‌లు నడిపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగున్నరేండ్లు బీపీటీ పూర్తి చేసిన వారినే ఫిజియోథెరపిస్టులుగా గుర్తించాలి. వైద్యారోగ్యశాఖ అధికారులు క్లినిక్‌లను తనిఖీ చేసి అర్హత లేనివారిపై యాక్షన్తీసుకోవాలి.
కె.వెంకటేశ్, రీచ్ఫిజియోథెరపీ క్లినిక్, మంచిర్యాల