
బషీర్బాగ్, వెలుగు: బ్రాండెడ్ పేరుతో నకిలీ ప్రొడక్ట్స్ తయారు చేసి, ఆన్లైన్లో విక్రయిస్తున్న నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. సైబర్ క్రైమ్ డీసీపీ వివరాల ప్రకారం.. పునర్జీవని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రాబిట్ బ్లడ్ హెయిర్ ఆయిల్ ను నకిలీ ప్రొడక్ట్ తయారు చేసి ఆన్లైన్ విక్రయిస్తున్నారని గతేడాది నవంబర్ 22న నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతానికి చెందిన ఏ1 విశేజ్ (21) ఫేక్ వెబ్ సైట్ నడుపుతూ అందులో బ్రాండెడ్ పేర్లతో నకిలీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి ఐదు మొబైల్ ఫోన్స్ , నాలుగు బ్యాంక్ పాస్ బుక్స్, 8 బ్యాంక్ చెక్ బుక్స్,16 డెబిట్ కార్డులను సీజ్ చేసి హైదరాబాద్ కు తరలించారు. బుధవారం అతనిపై కేసు నమోదు చేసి , రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో అతనికి సహకరిస్తున్న ఏ2 చౌహన్ నిరల్ , ఏ3 నికుల్ ను ఈ నెల 4న అరెస్ట్ చేసి రిమాండ్ కు
తరలించారు.