జగిత్యాల జిల్లాలో ఫేక్ రిపోర్టర్ అరెస్ట్.. ప్రముఖ మీడియా సంస్థ పేరిట రూ. 8.50 లక్షలు వసూలు

జగిత్యాల జిల్లాలో ఫేక్ రిపోర్టర్ అరెస్ట్.. ప్రముఖ మీడియా సంస్థ పేరిట రూ. 8.50 లక్షలు వసూలు
  • ఇంటెలిజన్స్​ ఆఫీసర్ ​ పేరిట మరో రూ. 7 లక్షలు డిమాండ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన జిల్లా ఇండస్ట్రియల్ మేనేజర్
  • ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ రఘు చందర్ వెల్లడి

జగిత్యాల, వెలుగు: మీడియా సంస్థ పేరిట జిల్లా ఆఫీసర్ ను బెదిరించి రూ. లక్షల్లో వసూలు చేసిన కేసులో ఫేక్ రిపోర్టర్ అరెస్ట్ అయిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలో శుక్రవారం డీఎస్పీ రఘుచందర్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. రాయికల్ మండలం లోక్య నాయక్ తండాకు చెందిన భూక్యా సంతోష్ నాయక్ ప్రముఖ మీడియా సంస్థ పేరిట జగిత్యాల జిల్లా ఇండ్రస్ట్రీయల్ డిపార్ట్ మెంట్ మేనేజర్ ఎర్ర యాదగిరిని పరిచయం చేసుకున్నాడు. ప్లాన్ వేసి తన బంధువైన మహిళ కారు లోన్ కు సబ్సిడీ కావాలని చెప్పి కవర్ లో రూ. 5 వేలు డబ్బులు పెట్టి ఆఫీసర్ కు ఇప్పించాడు. దీన్ని అతడు వీడియో తీసి అనంతరం ఆఫీసర్ కు పంపి.. న్యూస్ ఛానల్ లో అప్ లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 

గత నెల21న  మరోసారి ఇద్దరు వ్యక్తులు వెళ్లి మేనేజర్ ను కారులో తీసుకెళ్లి  బెదిరించారు. దీంతో భయపడిన అతడు పలుమార్లు రూ. 8. 50 లక్షలు ఇచ్చాడు. మరోసారి  ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ ను అని చెప్పి రూ. 7 లక్షలు ఇవ్వాలని బెదిరించగా బాధితుడు యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు భూక్య సంతోష్ నాయక్ తో పాటు అతనికి సహకరించిన కలెక్టరేట్ డీపీఆర్వో ఆఫీస్ అటెండర్ బాలే జగన్, పాలకుర్తి రాకేశ్, మాలోత్ తిరుపతి, భూక్య గంగాధర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు.