- ఇద్దరు అరెస్ట్, పరారీలో మరో వ్యక్తి
మిర్యాలగూడ, వెలుగు : రిపోర్టర్లమంటూ ఓ సీఐని బెదిరించి రూ. 1.10 లక్షలు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం డీఎస్పీ రాజశేఖర్ స్థానికంగా వెల్లడించారు. మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు అవినీతికి పాల్పడుతున్నట్లు ఇటీవల ఓ డిజిటల్ పేపర్‌లో వార్తలు పబ్లిష్ అయ్యాయి. తర్వాత సదరు డిజిటల్ పేపర్ చీఫ్ బ్యూరో ఆనంద్ కుమార్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుప్పరి రఘు, మాడ్గులపల్లి రిపోర్టర్ పేరబోయిన ఆంజనేయులు కలిసి రూ. 5 లక్షలు ఇవ్వాలంటూ సీఐ వీరబాబును డిమాండ్ చేశారు.
తనపై వరుసగా వస్తున్న వార్తలతో ఆందోళనకు గురైన సీఐ తన ఫ్రెండ్ సాయంతో ఆ ముగ్గురితో మాట్లాడి రూ. 2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా మాడ్గులపల్లి రిపోర్టర్ ఆంజనేయులుకు రూ. 1.10 లక్షలు ఇచ్చాడు. ఈ డబ్బుల్లో రూ. 10 వేలు ఆంజనేయులు, రూ. 15 వేలు రఘు తీసుకోగా, మిగతా రూ. 85 వేలు ఆనంద్ తీసుకున్నారు.
తర్వాత మిగతా డబ్బులు కూడా ఇవ్వాలంటూ ముగ్గురు వ్యక్తులు సీఐ వీరబాబుపై ఒత్తిడి తేవడంతో అతడు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం రఘు, ఆంజనేయులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు ఆనంద్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో టూ టౌన్ సీఐ నాగార్జున ఉన్నారు.