ఉప్పల్, వెలుగు: ఉప్పల్ ఏరియాలో ఫేక్ ఆర్టీవో అధికారుల బాగోతం బయటపడింది. ఆర్టీవోగా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని బాధితులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఉప్పల్‌కు చెందిన పాశం ప్రేమ్ కుమార్ రెడ్డి (43) మరో వ్యక్తితో కలిసి కంకర, ఇసుక, ఇతర మెటీరియల్ సప్లై చేసే ట్రాక్టర్లను ఆపి తనిఖీ చేస్తున్నారు. వాహనాలకు లైసెన్స్, ఇన్సూరెన్స్ లేవని అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారు.
దాదాపు ఏడాదిన్నర కాలంగా ఈ తంతు నడిపిస్తూ.. రోజూ రూ.20 నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. అయితే, ఆర్టీవో అధికారులమని చెప్తున్న వాళ్లు ప్రధాన రహదారుల వెంట ఉండకుండా గల్లీల్లోకి సైతం వస్తుండడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో వారిపై ట్రాక్టర్ యజమానులు, కాంక్రీట్ నిర్వాహకులు కొద్దిరోజులుగా నిఘా పెట్టారు.
సదరు వ్యక్తులు నిజమైన అధికారులు కాదని నిర్ధారించుకున్నారు. గురువారం ప్రేమ్‌కుమార్‌ను పట్టుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న మరొకరిని త్వరలో పట్టుకుంటామని సీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.