ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా యూపీ ఎన్నికల్లో వర్చువల్ ప్రచారాన్ని చేపట్టారు. ఇవాళ పశ్చిమ యూపీలోని 23 నియోజకవర్గాల్లో ఒకేసారి ఆయన వర్చువల్ ప్రచార సభను ప్రజలు చూసేలా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. అది ప్రజలు, సమాజం తరఫున నిలిచే సమాజ్‌వాదీ కాదని, కేవలం కుటుంబం కోసం పనిచేసే ‘పరవార్‌వాదీ’ పార్టీ అని ఆరోపించారు. ఫేస్‌సమాజ్‌వాదీలంటూ ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆయన కుటుంబంపై ధ్వజమెత్తారు. ఈ ఫేక్ సమాజ్‌వాదీలకు అధికారం ఇస్తే ప్రజలు, రైతుల పొట్టకొట్టి.. తమ కుటుంబ ఖజానాను నింపుకుంటారని ప్రధాని మోడీ ఆరోపించారు. వాళ్లను గెలిపిస్తే రైతులను పస్తులు పెడతారని అన్నారు. ఓటు వేసేటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, కుటుం రాజకీయాలు చేసే ఆ పార్టీకి అవకాశం ఇవ్వొద్దని కోరారు. సమాజ్‌వాదీ పార్టీ ఎప్పుడూ పేదలు, రైతుల సమస్యలు తీర్చడంపై దృష్టి పెట్టలేదని, యూపీలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకే రైతులకు ప్రభుత్వం నుంచి అందే లబ్ధి ఆరింతలు పెరిగిందని చెప్పారు. తమ డబుల్ ఇంజన్ ప్రభుత్వం రైతుల పంటలను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసి, డబ్బులను నేరుగా వారి వారి అకౌంట్లలోనే డిపాజిట్ చేస్తోందని అన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం కనీసం మద్దతు ధరపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
‘మాఫియావాదీ’లను గెలిపిస్తే సంక్షేమాన్ని ఆపేస్తరు
సమాజ్‌వాదీ పార్టీలో క్రిమినల్స్ ఉన్నారని, మాఫియా వాళ్లకు ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఈ మాఫియావాదీలకు అధికారం ఇస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలను నిలిపేస్తారని, రైతులకు కేంద్రం ఏటా డిపాజిట్ చేస్తున్న రూ.6 వేలను అడ్డుకుంటారని అన్నారు. యూపీ అభివృద్ది కోసం తమ డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని అన్నారు. ప్రజలు శాంతి భద్రతల అవసరాన్ని గుర్తించారని, అది లేకుంటే పరిశ్రమల రాక, రాష్ట్ర అభివృద్ధి అసాధ్యమని తెలుసుకున్నారని మోడీ అన్నారు. యూపీలో నేరాలు కంట్రోల్‌లోకి వస్తాయని ఎవరూ ఊహించలేదని, లా అండ్ ఆర్డర్‌ను సీఎం యోగి గాడినపెట్టారని, యూపీ మరింత అభివృద్ది చెందాలంటే డబుల్ స్పీడ్‌తో పని చేసే తమ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని మోడీ కోరారు.
You need to be very careful while casting your vote. If they get a chance, these family-driven fake Samajwadis will stop the aid being provided to farmers... These fake Samajwadi will make you go hungry: PM Narendra Modi#UttarPradeshElections pic.twitter.com/BmTK9deBi1
— ANI (@ANI) February 4, 2022
ఈ ఎన్నికలు చరిత్రను తిరగరాసేవి కావాలె
స్వాతంత్ర్య కాలం నుంచి యూపీ అనేక ఎన్నికలను చూసిందని, ఎన్నికల్లో గెలుపోటములు, ప్రభుత్వాలు మారడం సర్వసాధారణమని మోడీ అన్నారు. కానీ ఈసారి జరిగే ఎన్నికలు మాత్రం చాలా ప్రత్యేకమని, యూపీని శాంతిని కాపాడుకోవడం కోసం, సుస్థిర, నిరంతర అభివృద్ధి కోసం, మంచి పాలన కోసం, ప్రజల జీవితాలు మెరుగుపడడం కోసం ఈ ఎన్నికల్లో ఓటేయాలని ఆయన సూచించారు. మరోసారి రాష్ట్రంలో శాంతి భద్రతలను, ప్రజల గౌరవాన్ని, అభివృద్ధిని నిలిపే ఎన్నికలుగా నిలవాలని, చరిత్రలను తిరగరాసి, సరికొత్త చరిత్రను సృష్టించాలని మోడీ అన్నారు. తెర వెనుక ఉండి యూపీని కంట్రోల్ చేసే మాఫియాలకు, అల్లరి మూకలకు తమ రాష్ట్రంలో చోటు లేకుండా చేయాలన్న మైండ్ సెట్‌తో యూపీ ప్రజలు ఉండడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మోడీ అన్నారు.