గద్వాల, వెలుగు: నడిగడ్డ సీడ్ పత్తికి పెట్టింది పేరు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ లాగా ప్రతీ గ్రామంలోని రైతు ఎకరానో.. అర ఎకరానో సీడ్ పంటను సాగు చేస్తారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులతో చెలగాటమాడుతున్నారు. ఈ ఏడాది ఫెయిల్ అయిన సీడ్ ను రైతులకు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పండించిన పంటను ప్రైవేట్ కంపెనీలు కావాలని ఫెయిల్ చేస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడి పెడతామని, విత్తనాలు పాస్ అయితే రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వస్తాయని చెబుతున్నారు. ఫెయిల్ అయితే ఆ విత్తనాలు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఫెయిల్ అయిన సీడ్ విత్తనాలను కమర్షియల్ లో అమ్ముకుంటే పెట్టుబడి డబ్బులు అయినా వస్తాయని రైతులు అంటున్నారు. గతంలో సీడ్ విత్తనాలు పాస్ అయినా ఫెయిల్ అయినట్లు చూపించిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. తమ కష్టం మొత్తం ప్రైవేట్ కంపెనీలు తమ చేతుల్లో పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఎకరాకు రూ. లక్షకు పైగా పెట్టుబడి..
జోగులాంబ గద్వాల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా సీడ్ పత్తిని సాగు చేస్తారు. ఒక ఎకరా సీడ్ పత్తి సాగు చేయాలంటే రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు ఖర్చవుతుంది. ఎకరాకు 500 ప్యాకెట్ల నుంచి 800 ప్యాకెట్లు వస్తాయి. ప్రస్తుతం ప్యాకెట్ ధర రూ.500 ఉంది. ఒక్కో ఎకరాకు 5 నుంచి 8 మంది కూలీలు 3 నెలల పాటు కష్టపడి పనిచేస్తే, కంపెనీలు జెర్మినేషన్ లో పర్సంటేజ్ రాలేదని ఫెయిల్ చేస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలు చేసే మోసాలకు తాము నష్టపోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.
ఫెయిల్ సీడ్ పై క్లారిటీ ఉండట్లే..
గద్వాల జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఇందులో 40 వేల ఎకరాలకుపైగా సీడ్ పత్తిని సాగు చేస్తారు. ఇందులో 80 శాతానికిపైగా జర్మినేషన్ వచ్చిన వాటినే కంపెనీలు తీసుకుంటాయి. 80 శాతం కన్నా తక్కువ జర్మినేషన్ వస్తే ఫెయిల్ సీడ్ కింద పరిగణించి రైతులకే అప్పజెప్తారు. వీటిని ఏం చేయాలో అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పడం లేదు. సర్కారు నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు లేవు. వాస్తవానికి ఈ విత్తనాలు నాటితే పెద్దగా నష్టం ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ, కొందరు ఆర్గనైజర్లు, సీడ్ వ్యాపారులు రైతుల నుంచి వీటిని కొని యాసిడ్ ట్రీట్మెంట్ చేసి, కలర్ అద్ది, వివిధ కంపెనీల పేరిట ప్యాక్ చేసి ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారు. కేవలం 400 గ్రామల ప్యాకెట్ రూ.800 వరకు అమ్ముతున్నారు. వీటిని కొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు ఇలాంటి సీడ్ పై ఫోకస్ చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. కానీ, ఫెయిల్ సీడ్ ను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీలు తీసుకోకపోతే తామేం చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
నకిలీ సీడ్స్ దందా ఆగేనా?
వానాకాలం సీజన్ స్టార్ట్ అయ్యిందంటే చాలు ఉమ్మడి జిల్లాలో నకిలీ సీడ్స్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. పోలీసులు, అగ్రికల్చర్ ఆఫీసర్లతో కలిసి నిఘా పెట్టినా దందా ఆగడం లేదు. ప్రతి ఏడాది కేసులు నమోదవుతున్నా దందా ఆగడం లేదు. ఫెయిల్ కాటన్ సీడ్ పై క్లారిటీ లేకపోవడంతో వీళ్లు వాటిని ఇండ్లల్లోనే ఉంచుకుంటున్నారు. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ల దాడుల్లో అవే ఎక్కువగా దొరుకుతున్నాయి. నకిలీ దందా చేసే బడా వ్యాపారులు మాత్రం తప్పించుకుంటున్నారు. సీడ్ ఉత్పత్తి చేసే రైతులు కేసుల్లో ఇరుక్కుంటుంటే సీడ్ ను తీసుకునే కంపెనీలు,ఆర్గనైజర్లు మాత్రం దర్జాగా ఉంటున్నారు.
రైతులకు నష్టం జరిగితే ఊరుకోం..
నకిలీ సీడ్ వ్యాపారం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నం. రైతులకు నష్టం జరిగితే ఊరుకోం. జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు చేస్తున్నం. ఫెయిల్ సీడ్ ను కంపెనీలు ఇవ్వడం లేదు. రైతులకు అనుమానంఉంటే మళ్లీ టెస్ట్ చేసుకోవచ్చు. రైతుల సీడ్ పాస్, ఫెయిల్ అయిన విషయం రైతు మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పంపించమని చెప్పాం.
- గోవింద్‌నాయక్, డీఏవో, గద్వాల