మంచిర్యాల జిల్లాలో నకిలీ సీడ్​ దందా షురూ

మంచిర్యాల జిల్లాలో నకిలీ సీడ్​ దందా షురూ
  • సీజన్​కు ముందే జిల్లాకు చేరిన గ్లైసిల్ ​పత్తి విత్తనాలు
  • భీమిని మండలంలో రూ.6.85 లక్షల సీడ్​ పట్టివేత
  • ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి
  • జిల్లాలో ఏటా రూ.20 కోట్లకు పైగానే దందా  
  • సీజన్​ ప్రారంభంలోనే హడావుడి .చేస్తున్న ఆఫీసర్లు 
  • అప్పటికే రైతులకు చేరుతున్న నకిలీ విత్తనాలు

మంచిర్యాల, వెలుగు: పత్తి సీజన్​కు మూడు నెలలు ముందుగానే మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాల దందా షురువైంది. సీజన్​ ప్రారంభంలో అధికారుల నిఘా పెరిగే అవకాశం ఉండడంతో అక్రమార్కులు ముందుగానే స్టాక్​ తెచ్చుకుంటున్నారు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి నకిలీ సీడ్​ను రహస్య స్థావరాలకు తరలించి నిల్వ చేసుకుంటున్నారు. అదును చూసి గ్రామాల్లోని ఏజెంట్ల ద్వారా రైతులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈ నెల 3న భీమిని మండలం మల్లిడి వద్ద పోలీసులు 20 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న విషయం తెలిసిందే. వీటిని ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలం హత్తిని నుంచి వడాలకు బైక్​పై తరలిస్తుండగా పక్కా సమాచారంతో ట్రాప్​ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో హత్తిని గ్రామంలోని రాజన్న ఇంట్లో 2.27 క్వింటాళ్ల సీడ్​ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6.85 లక్షలు ఉంటుందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్​ తెలిపారు. చింతలమానెపల్లి మండలం గంగాపూర్​కు చెందిన పురుషోత్తం, పోశం, కృష్ణ, హత్తినికి చెందిన రాజన్న, గుంటూరుకు చెందిన సురేశ్​పై కేసు నమోదు చేశారు. 

రూ.20 కోట్ల పైమాటే.. 

మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని రైతులు నిషేధిత గ్లైసిల్​(బీటీ3) విత్తనాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 1.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉండగా, ఇందులో సగం విస్తీర్ణంలో గ్లైసిల్ నాటుతున్నారు. పత్తిలో సులువుగా కలుపు నివారణ, చీడపీడల బెడదను తట్టుకునేందుకు ఈ విత్తనాలపై మొగ్గు చూపుతున్నారు. గ్లైపోసెట్​అనే గడ్డిమందు కొడితే పత్తి మొక్కలకు ఎలాంటి నష్టం లేకుండా గడ్డి మాత్రమే చనిపోతుం దని ప్రచారం చేయడంతో రైతులు ఎగబడి కొంటున్నారు. ఇదే అదునుగా వివిధ కంపెనీల పేర్లతో లేబుల్స్​వేసి, లూజ్​గా రూ.2,500 నుంచి రూ.3వేలకు కిలో చొప్పున దళారులు అమ్ముతున్నారు. ఈ లెక్కన ఎకరానికి కిలో విత్తనాలు అవసరం కాగా.. జిల్లాలో ఏటా రూ.20 కోట్లపైనే నకిలీ దందా సాగుతోంది.

ఆంధ్ర దళారులకు అధికారుల అండ

నకిలీ సీడ్ ​దందాలో ఆంధ్రకు చెందిన దళారులదే కీలక పాత్ర. లోకల్​గా ఉన్న ఫర్టిలైజరర్స్​ నిర్వాహకులతో చేతులుకలిపి, గ్రామాల్లో ఏజెంట్ల నెట్​వర్క్​ను ఏర్పాటు చేసుకొని దందా నడిపిస్తున్నారు. గతంలో అధికార పార్టీ లీడర్ల కనుసన్నల్లోనే ఈ దందా సాగేది. వారికి వ్యవసాయ, పోలీస్​ అధికారుల అండ ఉండడంతో నకిలీ విత్తనాలను అరికట్టడం సవాల్​గా మారింది. ముఖ్యంగా మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లోని పోలీసు, అగ్రికల్చర్​ ఆఫీసర్లకు రూ.లక్షల్లో ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలున్నాయి. 

గతంలో బెల్లంపల్లి డివిజన్​లోని పోలీసు అధికారులు దళారుల నుంచి భారీగా వసూళ్లు చేసి చూసీచూడనట్టు వదిలేశారనే విమర్శలున్నాయి. నకిలీ సీడ్​ను కంట్రోల్​ చేయాలంటే ఇప్పటి నుంచే నిఘా పెంచాలని, టాస్క్​ఫోర్స్​ టీమ్​లను రంగంలోకి దించి దళారులను గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ దందాను అరికట్టేందుకు కలెక్టర్, పోలీస్​ కమిష నర్​ రంగంలోకి దిగాలని కోరుతున్నారు.

ఆలస్యంగా తేరుకుంటున్న అధికారులు

జిల్లాలో ఏటా పత్తి సీజన్ ప్రారంభానికి ముందునుంచే నకిలీ సీడ్​ దందా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఆలస్యంగా తేరుకుంటున్నారు. సీజన్​లో అధికారులు దాడులు పెరిగే అవకాశం ఉండడంతో దళారులు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. జనవరి నుంచే గ్లైసిల్​ సీడ్​ను తీసుకొచ్చి గ్రామాల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఏప్రిల్, మే నాటికే విత్తనాలను రైతులు చేర్చుతున్నారు. అధికారులు మాత్రం సీజన్​ ప్రారంభంలో అగ్రికల్చర్, పోలీస్​, రెవెన్యూ అధికారులతో టాస్క్​ఫోర్స్​ టీమ్​లు ఏర్పాటుచేసి తనిఖీలు చేపడుతున్నారు. అప్పటికే అంతా అయిపోవడంతో నామమాత్రంగా కేసులు బుక్​ చేసి చేతులు దులుపుకొంటున్నారు.