- మొద్దు నిద్రలో టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు
- సీడ్ వ్యాపారులు, అగ్రికల్చర్ ఆఫీసర్ల హస్తం!
- కరీంనగర్ నుంచి జిల్లాలోని షాపులకు సప్లయ్
- వ్యాపారులకు టార్గెట్లు పెట్టి అమ్మకాలకు ఒత్తిళ్లు
మంచిర్యాల/జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో నకిలీ కాటన్ సీడ్ మాత్రమే కాదు.. నకిలీ వరి విత్తనాల దందా కూడా జోరుగా సాగుతోంది. సీడ్ కంపెనీలతో కొంత మంది వ్యాపారులు, అగ్రికల్చర్అధికారులు కుమ్మక్కై నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో సీడ్ కంపెనీలు నడుపుతూ అక్కడ తయారుచేసిన విత్తనాలను జిల్లాలోని ఫెర్టిలైజర్స్షాపులకు సప్లయ్ చేస్తున్నారు. తాము సూచించిన సీడ్‌ను మాత్రమే అమ్మాలంటూ వ్యాపారులపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులను ముంచుతున్నారు. నష్టపోయామంటూ ప్రశ్నించే రైతులకు ఎంతో కొంత చెల్లించి విషయం బయటకు రాకుండా దాస్తున్నారు. ఈ అమ్మకాలను అడ్డుకోవాల్సిన టాస్క్‌ఫోర్స్ అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు.
రైతులకు మాయమాటలు చెప్పి..
ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో 1.59 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతోందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్అంచనా వేసింది. సీజన్ ప్రారంభం నుంచి మొన్నటిదాక ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం వల్ల వరిసాగు ఆలస్యమైంది. వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో రైతులు పొలం పనులను ముమ్మరం చేశారు. ఇప్పటికే కొంతమంది నార్లు పోసినప్పటికీ మెజారిటీ రైతులు ఇప్పుడిప్పుడే మొలక అలుకుతున్నారు. ఈ క్రమంలోనే ప్యాడీ సీడ్అమ్మకాలు జోరందుకున్నాయి. ఇదే అదునుగా ఫెర్టిలైజర్స్ వ్యాపారులు నాసికరం విత్తనాలను అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ, సీడ్రకాలను బట్టి 10 కిలోల బస్తాలకు రూ.800 నుంచి రూ.వెయ్యి, 25 కిలోల బస్తాలకు రూ.1500 నుంచి రూ.2వేలకు అమ్ముతున్నారు. అయితే, మార్కెట్లో పేరున్న కంపెనీల సీడ్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు మాయమాటలు చెప్పి లోకల్ కంపెనీల సీడ్‌ను విక్రయిస్తున్నారు.
సీడ్ కంపెనీల్లో భాగస్వామ్యం
జిల్లాలోని కొందరు సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వ్యాపారులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు కరీంనగర్ ప్రాంతంలోని లోకల్ సీడ్ కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. జైపూర్, భీమారం మండల కేంద్రాలకు చెందిన ఇద్దరు వ్యాపారులతో పాటు మంచిర్యాల, చెన్నూర్ డివిజన్లలో పనిచేస్తున్న నలుగురు అగ్రికల్చర్అధికారులు సీడ్ కంపెనీలకు సహకరిస్తూ చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. జైపూర్‌లోని ఓ వ్యాపారి రైతుల దగ్గర వడ్లు కొని కరీంనగర్‌లోని కంపెనీకి తరలిస్తున్నాడు. అక్కడ సీడ్ ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత ఓ కంపెనీ పేరుతో బ్యాగులపై లేబుల్స్ వేసి జిల్లాలోని షాపులకు సప్లయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రికల్చర్ఆఫీసర్లు సైతం ఆ కంపెనీకి చెందిన 1001 రకం విత్తనాల అమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. తాము చెప్పిన సీడ్‌ను మాత్రమే అమ్మాలని సీడ్ వ్యాపారులకు టార్గెట్లు ఇచ్చి ఒత్తిడి చేస్తున్నారు. జైపూర్, భీమారం మండలాలకు భారీ మొత్తంలో సప్లయి చేసిన ఈ విత్తనాలు 50 శాతమే మొలకలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
ALSO READ :గ్రూప్ 2 వాయిదా కష్టమే!
జెర్మినేషన్ టెస్టింగ్ పై అనుమానాలు
వివిధ కంపెనీలు తయారు చేస్తున్న వరి విత్తనాల నాణ్యతను నిర్ధారించేందుకు జెర్మినేషన్టెస్టింగ్చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏటా రెండు సీజన్లలో అగ్రికల్చర్డిపార్ట్మెంట్ఆయా జిల్లాలకు టార్గెట్లు ఇస్తుంది. ఈ మేరకు అధికారులు మండలాల్లోని ఫెర్టిలైజర్స్షాపుల నుంచి సీడ్శాంపిల్స్సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపుతారు. 80 శాతం మొలకలు వస్తే నాణ్యమైనవిగా, అంతకంటే తక్కువ వస్తే నాసిరకం విత్తనాలుగా నిర్ధారిస్తారు. నాసిరకం అని తేలితే సదరు కంపెనీపై కేసు నమోదు చేసి విత్తనాలను స్వాధీనం చేసుకుంటారు. కానీ జిల్లాలో జెర్మినేషన్ టెస్టులు సరిగా జరగడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్రికల్చర్ఆఫీసర్లు శాంపిల్స్సేకరణలోనే అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.