నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఇద్దరు అరెస్టు

నల్గొండ అర్బన్, వెలుగు :  నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఇద్దరిని మునుగోడు పోలీసులు అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ.10లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను బుధవారం జిల్లా పోలీస్​ కార్యాలయంలో ఎస్పీఅపూర్వరావు వెల్లడించారు. ఏపీలోని నంద్యాల జిల్లా తాళ్లగడ్డ మండలం గోవిందన్న గ్రామానికి చెందిన కర్నాటి మధుసూదన్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా తాళ్లూరు మండలం గండేపల్లికి చెందిన గురిజాల వీరబాబు నంద్యాల పరిసర ప్రాంతాల్లో రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పత్తి విత్తనాలు కొంటున్నారు. వాటిని గుంటూరుకు తరలించి అక్కడ హరికృష్ణారెడ్డికి చెందిన మిల్లులో   ప్రాసెస్ చేస్తున్నారు. వాటిని పలు పేర్లతో ప్యాక్ చేసి రైతులకు, డీలర్లకు అమ్మేందుకు మునుగోడుకు తీసుకొచ్చారు.

నకిలీ విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారం అందడంతో బుధవారం తెల్లవారుజామున మునుగోడు ఎస్సై సతీశ్​రెడ్డి బస్టాండ్ సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పత్తి విత్తనాలు ఉండడంతో అగ్రికల్చర్ ఆఫీసర్లను పిలిపించి చెక్ చేయగా నకిలీవని తేలింది. వారి నుంచి 8 క్వింటాళ్ల 45 కేజీల ముడి పత్తి విత్తనాలు, 444 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మిల్లు నిర్వాహకుడు హరికృష్ణారెడ్డి పరారీలో ఉన్నాడు. పట్టుపడిన ఇద్దరి నిందితులను రిమాండ్​కు తరలించారు. విత్తనాలు పట్టుకున్న డీఎస్పీ నర్సింహారెడ్డి, చండూర్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్సైలు సతీశ్​రెడ్డి, విజయ్ కుమార్, సిబ్బంది నాగరాజు, రామ నరసింహలను ఎస్పీ అభిందించారు.