
- పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి
- స్థానికంగా ఏజెంట్ల ద్వారా విక్రయాలు
- నేరుగా రైతుల వద్దకే వెళ్లి అంటగడుతున్న వైనం
- ఆదివారం 3.25 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుకున్న టాస్క్‌ఫోర్స్
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల దందాకు అడ్డుకట్ట పడటం లేదు. వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే నకిలీ పత్తి విత్తనాలు దందా జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులు, దళారులు.. అమాయక రైతులకు మాయ మాటలు చెప్పి అంటగడుతూ రూ.లక్షల్లో దండుకుంటున్నారు. కొందరు స్టానికంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని దర్జాగా నకిలీ దందా చేస్తున్నారు.
పటిష్ట వ్యవస్థ లోపం కారణంగా ఏటా నకిలీ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. చింతలమానేపల్లి మండలం గంగాపూర్‌కు చెందిన చాపిలె పురుషోత్తం, సిర్పూర్ టి మండలం భూపాలపట్నానికి చెందిన బొల్లబోయిన అశోక్ ఆదివారం 3 క్వింటాళ్ల 25 కిలోల నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.
మహారాష్ట్ర నుంచి దిగుమతి
మహారాష్ట్ర నుంచి నకిలీ పత్తి విత్తనాలు దిగుమతి చేసుకుంటున్న దళారులు.. నేరుగా రైతుల వద్దకే వెళ్లి వారిని మాయ చేస్తున్నారు. పొలం ఎంత ఉంది? ఈ సీజన్లో పత్తి పంట ఎంత వేస్తున్నారు? ఎలాంటి విత్తనాలు కావాలి? అని అడుగుతూ.. విత్తనాల కోసం దుకాణాల వద్ద పోవాల్సిన అవసరం లేదని, ఎన్ని ప్యాకెట్లు కావాలో చెప్తే చాలని, తొలకరి జల్లులు పడకముందే విత్తనాలు ఇంటికి పంపిస్తామని నమ్మిస్తున్నారు.
పత్తి కాయలు పెద్దగా వచ్చేది ఒక ధర, చిన్నగా వచ్చేవి కొంచెం ధర తక్కు కే ఇస్తామని గాలం వేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుని దుకాణాల్లో అమ్ముతున్నాయని, తాము నేరుగా మీ ఇంటికే సరఫరా చేస్తామని జోరుగా దందా కొనసాగిస్తున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లాలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ దళారులు పంథా మార్చి రైతులకు నేరుగా విత్తనాలు సరఫరా చేస్తున్నారు.
మారుమూల గ్రామాల్లో అవగాహన లేక..
ముఖ్యంగా తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏజెన్సీలోని గిరిజన రైతుల అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని నకిలీ, లూజ్ విత్తనాలను అంటగడుతున్నారు. గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారిద్వారా మారుమూల గ్రామాల్లో అమ్ముతున్నారు. ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, కౌటల ,బెజ్జుర్,సిర్పూర్ టి , కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యు, పెంచికల్ పేట్, చింతలమానేపల్లి మండలాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది.
నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దళారులు నేరుగా గ్రామాల్లోకి వచ్చి అమ్ముతుండడం, ఉద్దెర ఇస్తుండటంతో రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామ క్షేత్ర స్థాయిలో సదస్సులు నిర్వహించి,అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
చింతలమానేపల్లి మండలం గూడెం అంతరాష్ట్ర వంతెన వద్ద ఈనెల 22న బైక్ పై తరలిస్తున్న 70 కిలోల నకిలీ విత్తనాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గంగాపూర్ గ్రామానికి చెందిన చాప్లే వినోద్ సహా మరో ముగ్గురి మీద కేసు నమోదు చేశారు.
ఈ నెల 24న బెజ్జుర్ మండలం సొమినిలో తోర్రెం ప్రశాంత్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 70 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనికి అమ్మిన ముగ్గురు వ్యక్తులపైనా కేసు నమోదు చేశారు.
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. దుకాణాలతోపాటు ఏజెంట్లు, మధ్యవర్తుల ముసుగులో నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు పెడ్తం. నకిలీ, కల్తీ విత్తనాల రవాణా, విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, విత్తన కార్పొరేషన్, పోలీసు బలగాలతో జాయింట్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశాం. గుర్తింపు పొందిన విత్తన దుకాణాల్లోనే రైతులు విత్తనాలు కొనాలి. కంపెనీ పేరు, బిల్లులు లేకుండా విడిగా విత్తనాలు విక్రయిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌కు గానీ, మండల వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. -
సురేశ్ కుమార్, ఎస్పీ