
ప్రపంచంలో నకిలీలు రాజ్యమేలుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఓ నకిలీ ఎస్సై అవతారం బట్టబయలైంది. నకిలీ యూనిఫాం ధరించి చెక్ పోస్టుల వద్ద వాహనదారులను నిలిపి డబ్బులు దండుకుంటున్న ఫేక్ ఎస్సై హరీష్ ను నెల్లూరు జిల్లా సంగం పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది స్థానికులకు అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం అందించడంతో అసలు కథ బయటపడింది.
సంగంలో నకిలీ ఎస్సైగా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేస్తున్న హరీష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ 2023లో ఎస్సై ఫలితాల్లో సెలెక్ట్ అయ్యానని నమ్మించి, వాస్తవానికి ఎలాంటి నియామకం లేకుండానే నకిలీ ఎస్సైగా వేషధారణ చేసి ప్రజలను మోసం చేస్తున్నాడనిఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ వేమారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.
Also Read : తిరుమలలో దొంగల ముఠా అరెస్ట్
నకిలీ ఎస్సైగా చెలామణి అవుతున్న హరీష్ తనకు సరిగ్గా సరిపోయే ఎస్సై యూనిఫాంలను తయారు చేయించుకుని, బెల్ట్, సింహాలు, బూట్లు, నేమ్ ప్లేట్, టోపీ, నక్షత్రాలు అన్నీ సిద్దం చేసుకుని ఎస్సైగా మారిపోయాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కారుతో పాటు నకిలీ ఎస్సై వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనను దర్యాప్తు చేసిన పోలీసుల సేవలను డీఎస్పీ అభినందించారు. ప్రజలు ఇలాంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నకిలీ అధికారులపై అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.