ప్రభుత్వాల ఉచిత తాయిలాలు ప్రజలను సోమరిపోతుల్లా తయారు చేయడమే కాదు.. చెడుమార్గంలోనూ నడిపిస్తున్నాయనే దానికి నిదర్శనమే ఈ కథనం. ఓ వ్యక్తి నటి సన్నీలియోన్‌ను పేద మహిళగా చిత్రీకరించి ప్రభుత్వం పథకం కింద ప్రతి నెలా వెయ్యి రూపాయల పెన్షన్ అందుకుంటున్నాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి.. నటి సన్నీ లియోన్ పేరు మీద ఖాతా తెరిచి వివాహిత మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం ద్వారా లభ్ది పొందాడు. విష్ణు దేవ సాయి ప్రభుత్వం వివాహిత మహిళల కోసం తీసుకొచ్చిన 'మహతారీ వందన్ యోజన(Mahtari Vandan Yojana)' పథకం కింద ప్రతి నెలా వెయ్యి రూపాయలు పెన్షన్ రూపంలో అందుకున్నాడు. అందుకోసం ఇతను.. సన్నీ లియోన్ పేరుతో బ్యాంకు అకౌంట్ తెరచినట్లు అధికారులు గుర్తించారు. గతేడాది మార్చి నుంచి ప్రతి నెల రూ.1000 చొప్పున ఆ ఖాతాలో డబ్బు డిపాజిట్ అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బస్తర్ ప్రాంతంలోని తాలూర్ గ్రామంలో ఈ మోసం జరిగింది.
భర్త పేరు.. జానీ సిన్స్
వెయ్యి రూపాయల పెన్షన్ కోసం ఇతను చేసిన మరో నిర్వాకం ఏంటంటే.. సన్నీలియోన్ భర్తగా జానీ సిన్స్ పేరు వాడటం. జానీ సిన్స్ పేరుమోసిన ఓ పోర్న్ స్టార్. ఒకప్పుడు సన్నీలియోన్ కూడా అదేగా అంటే.. అవ్వొచ్చు. ఇప్పుడు ఆమె అవన్నీ మానుకొని సాధారణ జీవితాన్ని గడుపుతోంది. అటువంటి ఆమెను కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ కోసం జానీ సిన్స్ భార్యగా మార్చేశాడు.. ఈ ప్రబుద్ధుడు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విచారణ జరిపి బ్యాంకు ఖాతా సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ హరీస్ అధికారులను ఆదేశించారు. లబ్ధిపొందిన మొత్తాన్ని నిందితుని నుంచి తిరిగి వసూలు చేయాలని సూచించారు.
ఇప్పుడీ విషయం ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. పథకం నిధులు దారిమళ్లుతున్నాయని, లబ్ధిదారుల్లో 50 శాతం నకిలీవే అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.