- తటస్థ ఓటరును తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్
- పోటాపోటీగా సర్వేలు రిలీజ్ చేస్తున్న పార్టీలు
- ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా ప్రయత్నాలు
హైదరాబాద్, వెలుగు: మునుగోడు బైపోల్‌కు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఫేక్ సర్వేలు గందరగోళం సృష్టిస్తున్నాయి.ఇ క్కడ పూటకో ఫేక్ సర్వే వెలుగులోకి వస్తోంది. తటస్థంగా ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమే ధ్యేయంగా ఈ సర్వేలను రిలీజ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న మూడు పార్టీల నేతలు ఇలాంటి సర్వేలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. కొన్ని సంస్థలు అసలు సర్వేనే చేయకుండా మునుగోడు ఓటర్ మనోగతం ఇది అంటూ పోస్టులు పెడుతుండగా, కొన్ని వ్యవస్థలను సైతం సర్వేల రొంపిలోకి లాగి రాజకీయ లబ్ధి పొందేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్ సర్వే పేరుతో సోషల్ మీడియాలో ఒక రిపోర్ట్ కలకలం సృష్టించింది. ఈ ప్రచారాన్ని ఆర్‌ఎస్‌ఎస్ తిప్పికొట్టిన తర్వాత కూడా మునుగోడు నియోజకవర్గంలోని వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో ఈ రిపోర్టును సర్క్యులేట్ చేస్తూనే ఉన్నారు. ఫలానా పార్టీ గెలుస్తుందని ప్రముఖ సర్వే ఏజెన్సీ చెప్పిందని ప్రచారంలో పెడుతూ, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
సర్వే చేసిన 50 సంస్థలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచే మునుగోడులో పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సర్వేల జోరు పెరిగింది. టీఆర్‌ఎస్ కోసం దాదాపు పది సంస్థలు గ్రౌండ్‌లో వర్క్ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరపునా పలు ఏజెన్సీలు పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటికి తోడు అనేక యూట్యూబ్ చానల్స్ సైతం ఓటర్ల మూడ్ పసిగట్టేందుకు ఫీల్డ్ వర్క్ చేస్తున్నాయి. పొలిటికల్ పార్టీలతో కలిసిన సంస్థలు వాటికి అనుకూలంగా నివేదికలు ఇస్తుండగా, ఇండిపెండెంట్‌గా సర్వే చేస్తున్న సంస్థలు ఎంతో కొంత ప్రజానాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటి వరకు మునుగోడు ఓటరు మనోగతం ఇది అంటూ 50 సంస్థలు సోషల్ మీడియా వేదికగా తమ సర్వేలను ప్రకటించాయి. మునుగోడులో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూడండంటూ వారం రోజుల క్రితం ‘మిషన్ చాణక్య’ సర్వే పేరుతో సోషల్ మీడియాలో ఒక రిపోర్ట్ సర్క్యులేట్ అయింది. ఆ సర్వే తాము చేసింది కాదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాము ఈసీ నిబంధనలు అతిక్రమించి ఎలాంటి సర్వే ఫలితాలు వెల్లడించలేదని ఆ సంస్థ తేల్చిచెప్పింది. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ పేరుతో మంగళవారం ఇంకో సర్వే సర్క్యులేట్ చేశారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఆ సర్వే ఉండడంతో ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఆ రిపోర్ట్ ను విస్తృతంగా సర్క్యులేట్ చేసింది. అయితే తాము ఎలాంటి సర్వే చేయలేదని ఆర్ఎస్ఎస్ ప్రకటించిన తర్వాత కూడా టీఆర్‌ఎస్ నేతలు ఆ రిపోర్ట్‌ను సర్క్యులేట్ చేయడం ఆపలేదు.
ఆ సర్వే మేం చేయలే: ఆర్‌ఎస్‌ఎస్
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తాము ఎలాంటి సర్వే చేయలేదని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవహ కాచం రమేశ్ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్, అంతరిక సర్వేక్షణ పేరుతో అజ్ఞాత వ్యక్తి సంతకం చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ వైభవం సాధించాలనే మౌలిక లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ 97 ఏళ్లుగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ అని ఆయన వెల్లడించారు. తమ సంస్థ రాజకీయాల కోసం పనిచేయదని తేల్చిచెప్పారు. కొందరు తమ ప్రయోజనాల కోసం అసంబద్ధమైన, అసత్యమైన వార్తలు, కథనాలు, వ్యాఖ్యానాలు చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. ఫేక్ సర్వేకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులను ఆయన డిమాండ్ చేశారు.