- గుట్టల భూముల్లో బేస్‌మెంట్లు నిర్మించి అమ్మకాలు
- ధరణిలో తప్పు చూపిస్తున్న సర్వే నంబర్ సాయంతో నకిలీ పట్టాలు
- తహసీల్దార్ల సంతకాలు సైతం ఫోర్జరీ చేసిన్రు
- అడ్డుకోవడమే తప్ప చర్యలు తీసుకోని ఆఫీసర్లు
గోదావరిఖని, వెలుగు: రామగుండం మండలం ఎన్టీపీసీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్య కాలనీలోని సర్కార్, ఫారెస్ట్ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. గుట్టలను ఆక్రమించి బేస్‌మెంట్లు నిర్మిస్తూ అమ్ముతున్నారు. ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీ సమీపంలోని సర్వే నెంబర్ 557/1, 557/2 లలో సుమారు 390 ఎకరాలకు పైగా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. దీనికి ఆనుకొని సర్వే నంబర్580లో ప్రభుత్వ స్థలం ఉంది. దీనిలో 10 ఎకరాలు ఆటో డ్రైవర్లకు ఇచ్చారు. అయితే ఈ స్థలం ఇండ్ల నిర్మాణానికి అనువుగా లేకపోవడంతో కొంతమంది అమ్మేసుకున్నారు. ఇదే అదునుగా ఆటోడ్రైవర్ల స్థలాలని చెప్పి పక్కనే ఉన్న ప్రభుత్వ, ఫారెస్ట్ భూములను అమ్ముతున్నారు. గుర్తించిన ఆఫీసర్లు కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు తప్ప అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది.
ఇందిరమ్మ కాలనీలోనూ కబ్జాలే..
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి శివారులో నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వం 2008లో 100 వంద ఎకరాలు సేకరించింది. సర్వే నంబర్ 600 నుంచి 624 వరకు గల స్థలంలో 85 ఎకరాలు ఇందిరమ్మ హౌజింగ్ కాలనీ కోసం కేటాయించగా, మరో 15 ఎకరాలు మిగిలి ఉంది. అయితే ఈ స్థలాన్ని కొంత మంది కబ్జా చేసి నకిలీ పట్టాలు సృష్టించారు. ఈ భూములు తమకు కేటాయించినవేనని బేస్ మెంట్లు, ఇండ్లు నిర్మిస్తూ అమ్మేస్తున్నారు. ప్రభుత్వం సేకరించిన సర్వే నంబర్ 610లో 7.32 ఎకరాలు ఉండగా ధరణిలో దీని విస్తీర్ణం మరో సర్వే నంబర్‌లో చూపిస్తోంది. రెవెన్యూ అధికారులు ఈ తప్పును గుర్తించినా సవరించకపోవడంతో దీన్ని అవకాశంగా తీసుకొని అక్రమార్కులు ఈ స్థలంలో ప్లాట్లు చేసి అమ్మేందుకు రెడీ అయ్యారు. అధికార పార్టీ లీడర్ల అండతోనే కబ్జాకోరులు విజృంభిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
తహసీల్దార్ల సంతకాల ఫోర్జరీ
ఇందిరమ్మ కాలనీలోని ప్రభుత్వ స్థలంలో 2008 నుంచి ఇప్పటివరకు 6,385 ఇండ్లను మంజూరు చేయగా కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు. మరికొంతమంది వివిధ కారణాలతో ఇండ్లు నిర్మించుకోకపోవడంతో అక్రమార్కులకు అవకాశంగా మారింది. గతంలో రామగుండం తహసీల్దార్లుగా పనిచేసిన భుజంగరావు, శ్రీనివాసరెడ్డి, గుడూరి శ్రీనివాసరావు సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పట్టాలు తయారు చేశారు. అయితే ఇటీవల నకిలీ పట్టాలను రెవెన్యూ ఆఫీసర్లు గుర్తించారు. నకిలీ ఇండ్ల పట్టాలు ఉన్న ఏడుగురిని పోలీసులకు అప్పగించి అనంతరం తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. కానీ ఈ నకిలీ ఇండ్ల పట్టాల తయారీలో కీలక పాత్ర పోషించిన వారు మాత్రం ఇంకా చిక్కలేదు. అధికార పార్టీ అండతోనే వారు తప్పించుకుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రభుత్వ భూములనుకబ్జా చేస్తే చర్యలు
రామగుండం మండల పరిధిలోని పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీలోని ప్రభుత్వ, ఫారెస్ట్ భూములను కబ్జా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇటీవల ఇందిరమ్మ కాలనీలో నకిలీపట్టాలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసి బైండోవర్ చేశాం. ప్రజలు అక్రమార్కుల మాటలు నమ్మి చట్టబద్ధం కాని భూములను కొనుగోలు చేసి మోసపోవద్దు.
జాహెద్ పాష, తహసీల్దార్, రామగుండం