- 5 వేల నుంచి 7 వేల దాకా ఇట్లాంటివే.. గందరగోళంగా ఓటర్ల జాబితా
- మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల వాళ్ల పేర్లు కూడా..!
- సెగ్మెంట్లో కొందరికి రెండు ఊర్లలో ఓట్లు
- గెలుపోటములపై ప్రభావం
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక కోసం తయారు చేసిన ఓటర్ల జాబితాపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒక్క నియోజకవర్గ పరిధిలోని వేర్వేరు మండలాల్లో, పక్కపక్క ఊర్లలో నమోదైన ‘డబుల్ ఓట్లు’ మూడు వేలకు పైగా ఉన్నాయి. వీటికి తోడు వందల కిలోమీటర్ల దూరంలోని సిరిసిల్ల, వేములవాడ ఓటర్లు, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లోని ఓటర్ల పేర్లు కూడా సడెన్‌గా ఇప్పుడు మునుగోడు ఓటర్ల ఫైనల్ లిస్టులో ప్రత్యక్షమయ్యాయి. ఇలా వేలాదిగా ఉన్న డూప్లికేట్ ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేసే చాన్స్ ఉంది.
ముందునుంచీ ఫిర్యాదులు
ఒక నియోజకవర్గంలోని ఓటర్లు మరో నియోజకవర్గంలో ఉంటే.. వాటిని డూప్లికేట్ ఓట్లుగా గుర్తించి తొలిగించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పైనే ఉంది. అదేమీ పట్టించుకోకుండా.. ఈసీ ఇష్టమొచ్చినట్లుగా ఓటర్ల పేర్లు నమోదు చేసిందని, అందుకే మునుగోడు ఓటర్ల ఫైనల్ లిస్ట్ లో డూప్లికేట్ ఓట్లు భారీగా కనిపిస్తున్నాయనే వాదనలున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్పార్టీ ఇతర నియోజకవర్గాల్లోని కార్యకర్తలు, అనుచరుల పేర్లను మునుగోడులో నమోదు చేయించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్‌ను తమకు అనుకూలంగా మలుచుకునే ఎత్తుగడలో భాగంగా ఇలా చేసి ఉంటుందనే ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. వీటన్నింటినీ తొలిగించాలని ఇప్పటికే పలు పార్టీలు ఈసీకి విజ్ఞప్తి చేశాయి. ఓటరు లిస్టులోని అవకతవకలపై బీజేపీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఈలోపే ఓటర్ల తుది జాబితా విడుదలైంది. అందులో డూప్లికేట్ ఓట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు బోగస్ ఓట్లు లేనే లేవని, డూప్లికేట్ ఓటర్లను ఏరేసినట్లు సీఈవో వికాస్‌రాజ్ ఇటీవలే ప్రకటించారు. కానీ.. మునుగోడులో లెక్కలేనన్ని డూప్లికేట్ఓట్లు ఫైనల్ లిస్టులో ఉండటం అనుమానాలకు తావిస్తున్నది. మ్యానువల్ పరిశీలనకు సరిపడేంత టైమ్ లేనప్పుడు.. సాఫ్ట్ వేర్ సాయంతో డూప్లికేట్ ఓట్లను గుర్తించే చాన్స్ ఉంది. అదేమీ పట్టించుకోకుండానే ఈసీ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 22.04 లక్షల ‘డబుల్ ఓట్లు’ ( ఒకే ఫొటోతో రెండు ఓటర్ ఐడీ కార్డులు) ఉన్నట్లు ఈసీ 5 నెలల కిందటే ప్రకటించింది. వాటిని ప్రత్యేక సాఫ్ట్ వేర్, యాప్ సాయంతో తొలిగిస్తున్నామని చెప్పింది. అయితే.. ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడులో డూప్లికేట్ ఓట్లు కనిపిస్తుండటంతో అసలు అప్పట్లో చెప్పిన 22.04 లక్షల ఓట్లను ఈసీ తొలిగించిందా.. లేదా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది.
10 రెట్లు కొత్త ఓట్లు పుట్టుకొచ్చినయ్
మునుగోడులో కొత్త ఓటరు నమోదు జరిగిన తీరుపై ముందునుంచీ ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ఓటర్ల సవరణ జరిగినప్పుడల్లా 2 వేల నుంచి 3 వేల కొత్త ఓట్లు నమోదవుతా యి. అనూహ్యంగా అంతకు పది రెట్లు కొత్త ఓట్లు మునుగోడులో పుట్టుకొచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో 2.14 లక్షల ఓట్లు ఉండగా.. ఇప్పుడు 2.41 లక్షల ఓట్లు ఉన్నట్లు లిస్టు విడుదలైంది.