రాచకొండ సీపీ ఫోటోతో ఫేక్ వాట్సాప్

రాచకొండ : సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా  రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ డీపీని క్రియేట్ చేశారు. ఆ నంబర్ నుంచి ప్రజలకు మెసేజ్ లు చేస్తూ, మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పందించారు. 87647 47849 నంబర్ తో ఫేక్ వాట్సాప్ డీపీని సైబర్ దొంగలు సృష్టించారని వెల్లడించారు. ఈ వాట్సాప్ నంబర్ నుంచి వస్తున్న  మెస్సేజ్ లను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నిందితున్ని పట్టుకునే పనిలో సైబర్ టీం ఉందని తెలిపారు. 

గతంలో..

గతంలోనూ సైబర్ కేటుగాళ్లు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ఫొటోతో ఫేక్ వాట్సాప్ డీపీని సృష్టించి మోసానికి పాల్పడ్డారు. ఆయన గతంలో తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించి, ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. ఈనేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న శ్రీమన్నారాయణకు జస్టిస్ సతీశ్ చంద్రశర్మ  ఫొటోతో ఉన్న ఫేక్ వాట్సాప్ డీపీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ‘‘నేనిప్పుడు ప్రత్యేక సమావేశంలో ఉన్నాను. డబ్బులు అత్యవసరం. ప్రస్తుతం నా దగ్గరున్న కార్డులన్నీ బ్లాక్ అయ్యాయి’’ అని ఆ మెసేజ్ లో ఉంది. దీన్ని చూసిన శ్రీమన్నారాయణ.. అది నిజంగా జస్టిస్ సతీశ్ చంద్రశర్మ నుంచి వచ్చిన మెసేజేనని భావించి, రూ.2 లక్షలు విలువైన అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపించాడు.  ఆ తర్వాత విషయం బయటపడటంతో సైబర్ నేరస్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.