మెదక్ లో దొంగ జ్యోతిష్యుడు అరెస్ట్

మెదక్ లో దొంగ జ్యోతిష్యుడు అరెస్ట్

మెదక్, వెలుగు: ఒంటరి మహిళలను మాయ మాటలతో లోబరచుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న దొంగ జ్యోతిష్యుడిని మెదక్  పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జిల్లా పోలీస్ ఆఫీసులో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ  మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల బాపు స్వామి అలియాస్ శివ స్వామి మెదక్, సంగారెడ్డి, వరంగల్  తదితర జిల్లాల్లో తిరుగుతూ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న  మహిళలను టార్గెట్ చేసి మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేశాడు.

ఎవరైనా ఆరోగ్యం బాగాలేదంటే పూజలు చేసి నయం చేస్తానంటూ తీర్థం పేరుతో స్లీపింగ్ పిల్స్ కలిపిన నీళ్లను తాగించి వారు స్పృహ కోల్పోయాక వారిపై  లైంగిక దాడికి పాల్పడుతు వీడియోలు తీసేవాడని తెలిపారు. తర్వాత ఆ వీడియోలను  వారికి చూపించి మహిళలను బ్లాక్ మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడని వివరించారు.

రెండేళ్లుగా పలు జిల్లాల్లో నలుగురు మహిళలను ఇలా మోసగించి రూ.10 వేలు మొదలుకొని రూ.లక్ష  వరకు వసూలు చేశాడని చెప్పారు. నమ్మదగిన సమాచారం మేరకు శివ స్వామిని అరెస్ట్ చేసి విచారించగా అతను చేసిన మోసాలు బయటపడ్డట్టు తెలిపారు. అతని దగ్గర నుంచి రెండు ఫోన్లు,  బైక్, తాయత్తులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు.