Champions Trophy 2025: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్ ఓపెనర్ ఔట్

Champions Trophy 2025: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్ ఓపెనర్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఐసీసీ మెగా టోర్నీ పాకిస్థాన్ లో జరుగుతుందనే ఆనందం తప్ప ఆ జట్టుకు ఎలాంటి ఆనందం లేదు. బుధవారం (ఫిబ్రవరి 19) టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ ఫకర్ జమాన్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు. ఆదివారం (ఫిబ్రవరి 23) భారత్‌తో జరగబోయే మ్యాచ్ కు పాకిస్తాన్ స్క్వాడ్ తో దుబాయ్ కు ఫఖర్ వెళ్లడం లేదని తెలుస్తుంది. కీలకమైన ఈ మ్యాచ్ కు ఈ పాక్ ఓపెనర్ దూరం కావడంతో ఆ జట్టు విజయావకాశాలు సన్నగిల్లాయి.   

Also Read:- బంగ్లాపై కొడతాడా.. పాక్ వరకు ఆగాల్సిందేనా: ఆల్‌టైం రికార్డుకు చేరువలో కోహ్లీ

స్కానింగ్ లో సైతం ఫకర్ జమాన్ కు ఎలాంటి సానుకూల సంకేతాలు కనిపించకపోవడంతో అతను ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఫఖర్  స్థానంలో ఇమామ్-ఉల్-హక్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ పాకిస్థాన్ ఓపెనర్ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమయ్యాడు. దూకుడుగా ఆడగలడు అనే పేరున్న ఫకర్ 41 బంతుల్లో 24 పరుగులే చేసి బ్రేస్ వెల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు.      

అసలేం జరిగిందంటే..?

ఆట ప్రారంభమైన రెండో బంతికే ఫీల్డింగ్‌ చేస్తూ  ఫకర్‌ జమాన్ గాయపడ్డాడు. నడుము గాయంతో అతడు మైదానాన్ని వీడాడు. అలా పోయినోడు మరో రెండు ఓవర్లలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగుస్తుంది అనంగా మైదానంలోకి వచ్చాడు. దాంతో ఓపెనింగ్ చేయడానికి అంపైర్లు అతన్ని అనుమతించలేదు. ఐసీసీ నిబంధన 24.2.3.2 ప్రకారం, ఒక ఆటగాడు 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు మైదానాన్ని వీడితే, నిర్దిష్ట సమయాన్ని పెనాల్టీగా  విధిస్తారు. దీంతో కివీస్ పై నిన్న జరిగిన మ్యాచ్ లో నాలుగో స్థానంలో అతను బ్యాటింగ్ కు వచ్చాడు.