AUS vs PAK 2024: బాబర్ అజామ్‌కు సపోర్ట్.. పాక్ జట్టులో చోటు కోల్పోయిన ఫఖర్ జమాన్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదివారం (అక్టోబర్ 27) ఆస్ట్రేలియా, జింబాబ్వేతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్లను ప్రకటించింది. రెండు పర్యటనలో ఫఖర్ జమాన్ కు చోటు కల్పించకుండా బిగ్ షాక్ ఇచ్చింది. స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌కు సపోర్ట్ చేసినందుకు అతన్ని పాక్ జట్టులో ఎంపిక చేయలేదు. అంతేకాదు ఫఖర్ ను సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించారు.

ఇంగ్లాండ్ తో రెండు, మూడు టెస్టులకు స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ను తప్పించని సంగతి తెలిసిందే. బాబర్ ను ఎంపిక చేయకపోవడంతో పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మండిపడ్డాడు. అతడిని ఎందుకు జట్టు నుంచి తప్పిస్తారని బాబర్ కు మద్దతుగా నిలిచాడు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలుస్తూ బాబర్ ను వెనకేసుకొచ్చాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు సీరియస్ గా తీసుకొని అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విధానాలు, ఎంపికను విమర్శించడం ద్వారా ఫఖర్ జమాన్ క్రమశిక్షణ ఉల్లఘించాడని నోటీసుల్లో పీసీబీ పేర్కొంది. అంతటితో ఆగకుండా పాక్ క్రికెట్ జట్టు నుంచి ఉద్వాసన పలికింది. ఆస్ట్రేలియా, జింబాబ్వేతో జరగబోయే మొత్తం నాలుగు స్క్వాడ్ లో ఈ పాక్ ఓపెనర్ ను ఎంపిక చేయకుండా పక్కనే పెట్టేసింది.

ALSO READ | IPL 2025: శ్రేయాస్‌ను పట్టించుకోని కోల్‌కతా.. అయ్యర్‌పై మూడు ఫ్రాంచైజీలు కన్ను

2023 భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఫఖర్‌ పాక్ తరపున అద్భుతంగా ఆడి టాప్ స్కోరర్ గా నిలిచాడు. గత నాలుగేళ్లుగా పాక్ జట్టులో నిలకడగా రాణిస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. 34 ఏళ్ళ ఈ ఓపెనర్ పాకిస్తాన్ తరపున 3 టెస్టుల్లో 192 పరుగులు.. 82వన్డేల్లో 3492 పరుగులు.. 92 టీ20 మ్యాచ్ ల్లో 1848 పరుగులు చేశాడు.పాకిస్థాన్ తరపున వన్డేల్లో డబులు సెంచరీ కొట్టిన ఏకైక బ్యాటర్. 2019 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పై సెంచరీ చేసి ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.