Cyber crimes: వాట్సప్ డీపీ స్కామ్​.. 4 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు

Cyber crimes: వాట్సప్ డీపీ స్కామ్​.. 4 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు

ముంబై: మహరాష్ట్ర ముంబైలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ అండ్ మెషిన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ  సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని రూ.4.4 కోట్లు మోసపోయింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి అదే కంపెనీలో పనిచేసే ఉద్యోగిని నమ్మించి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ముంబైలోని ఇంజినీరింగ్ అండ్ మెషిన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలో పనిచేసే సీనియర్ ఉద్యోగికి  జనవరి 7న తెలియని నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వాట్సాప్ డీపీని చూసిన ఉద్యోగి అది తను పనిచేసే కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని నమ్మాడు. కొత్త నంబర్ నుంచి ఎందుకు మెసేజ్ చేశారని ప్రశ్నించాడు.  ఇంటర్నెట్ సమస్య కారణంగా కొత్త నంబర్‌‌‌‌ను వాడాల్సి వచ్చిందని సైబర్ నేరగాడు మెసేజ్ చేశాడు. 

అదే సమయంలో కంపెనీ అసలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వ్యాపార పర్యటనలో ఉన్నందున.. ఆ ఉద్యోగికి ఎటువంటి అనుమానం కలగలేదు. క్రిమినల్ అని తెలియక అతని రిక్వెస్ట్ మేరకు కొత్త నంబర్‌‌‌‌ను సేవ్ చేసుకున్నాడు. ఆ తర్వాతి రోజు సైబర్ క్రిమినల్..  "ముఖ్యమైన వ్యాపార ఒప్పందం ఉంది. కంపెనీ అకౌంట్ నుంచి రూ. 2.6 కోట్లు పంపించు" అని ఉద్యోగికి మెసేజ్ చేశాడు.  అడిగేది కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేనని నమ్మిన ఉద్యోగి ..  రూ. 2.6 కోట్లు ట్రాన్స్ ఫర్ చేసేశాడు. తర్వాతి రోజు కూడా రూ.1.8 కోట్లు చేశాడు. మొత్తం రూ.4.4 కోట్లు కంపెనీ నుంచి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. నిజమైన ఎగ్జిక్యూటివ్   డైరెక్టర్‌‌‌‌ కంపెనీకి రాగానే  రూ.4.4 కోట్లు డబ్బుల చెల్లింపు వోచర్‌‌‌‌లను ఇవ్వాలని ఉద్యోగి కోరాడు. దాంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌ షాక్ అయ్యాడు. తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని.. డబ్బులు అడగలేదని చెప్పాడు. దీంతో షాక్ అయిన ఉద్యోగి.. వెంటనే  సైబర్ క్రైమ్ పోలీసులకు  ఫిర్యాదు చేశాడు.